మంత్రి మల్లారెడ్డికి పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా ఆఫర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో తనకు విలన్ గా ఆఫరొచ్చిందని తెలంగాణ మినిస్టర్ మల్లారెడ్డి పబ్లిక్ గా చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తేరీ కు అఫీషియల్ రీమేక్. అయితే తేరీని ఉన్నది ఉన్నట్లు దింపేయకుండా గబ్బర్ సింగ్ మాదిరిగా ఒరిజినల్ కంటే ఇదే బెస్ట్ అనిపించేలా హరీష్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ ను సెట్ చేసే పనిలో ప్రస్తుతం హరీష్ శంకర్ బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే విలన్ క్యారెక్టర్ కోసం హరీష్ శంకర్, మంత్రి మల్లారెడ్డిని కలిసి గంటన్నరకు పైగా బ్రతిమాలాడాడట. కానీ మల్లారెడ్డి ఆ క్యారెక్టర్ చేయడానికి నో అన్నాడట. ఛాయ్ బిస్కెట్ టీమ్ నిర్మించిన మేం ఫేమస్ టీజర్ లాంఛ్ లో ఈ విషయాన్ని స్వయంగా మల్లారెడ్డినే చెప్పారు.
తేరీ మూవీలో ఈ క్యారెక్టర్‌ను మహేంద్రన్ పోషించారు. పరమ దుర్మార్గుడిగా ఆయన మంచి నటనను కనబరిచి, అవార్డులు కూడా అందుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో సమంతను దారుణంగా చంపేది కూడా ఈ విలనే క్యారెక్టరే. అయితే వయసు పరంగా హరీష్ శంకర్, మల్లారెడ్డిని అనుకోవడం బెస్ట్ ఛాయిసే కానీ, అంత పవర్ ఫుల్ రోల్‌ని అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలియని మల్లారెడ్డితో వేయించాలని ఎందుకనుకున్నాడో ఆయనకే తెలియాలి.
ఇదంతా పక్కన పెడితే, మల్లారెడ్డి వ్యాఖ్యల ప్రకారం, ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ తో పోటీ పడే ప్రతినాయకుడు పాత్ర ఇంకా ఎవరు చేస్తారనేది ఫిక్స్ కాలేదు. రీసెంట్‌గా వినోదాయ సీతం రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్, ఏప్రిల్ 5నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం హరీష్, పవన్ ను 90 రోజులు డేట్స్ అడిగినట్లు సమాచారం. మరి ఎన్నికల వేళ పవన్ తన ఖరీదైన సమయాన్ని హరీష్ కు ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.