ASBL Koncept Ambience
facebook whatsapp X

టాలీవుడ్ కు ఏపీ రెడ్ కార్పెట్...

టాలీవుడ్ కు ఏపీ రెడ్ కార్పెట్...

ఏపీలో ప్రభుత్వం మారడం సినీరంగానికి ఊరట కలిగినట్లైంది. మరీ ముఖ్యం వైసీపీ సర్కార్ ఉన్న సమయంలో టికెట్ రేట్ల నుంచి పలు విషయాలపై విభేదాలు తప్పలేదు. సినీఇండస్ట్రీ నుంచి చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్ సహా పలువురు అగ్రనటులు.. నేరుగా నాటి సీఎం జగన్ ను కలిసినా పెద్దగా ఫలితం లేకపోయింది. దీనికి తోడు పవన్ కల్యాణ్..నేరుగా వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేయడం, నాటి మంత్రులు సైతం కౌంటర్ ఎటాక్ చేయడంతో సినీపరిశ్రమ నలిగిపోయింది. సినీ ఇండస్ట్రీ పిచ్చుకలాంటిదని..దాన్ని టార్గెట్ చేయొద్దన్నారు చిరంజీవి. అయినా సరే విమర్శలు తప్పలేదు.

అయితే ప్రభుత్వం మారింది. ఇప్పుడు ప్రభుత్వం జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఈపరిణామం సినీ ఇండస్ట్రీలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇక ఏపీలో సినిమా రంగానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని సినీప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులున్నాయి. ఎవరికి ఏ సమస్య ఎదురైనా పవన్ ఉండనే ఉన్నారు. మరోవైపు బాలకృష్ణ సైతం అందుబాటులో ఉంటారు. ఇక చిరంజీవి ఒక్క మాట చెప్పినా పవన్ తప్పక శిరసావహిస్తారు. ఇంకేముంది అంతా అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది.

ఇలాంటి సమయంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి , జనసేన నేత కందుల దుర్గేష్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి సినిమా షూటింగ్ లకు అనువుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏపీలో సినిమా స్టూడియోల నిర్మాణానికి టాలీవుడ్ నిర్మాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు సంపూర్ణ సహకారం ఉంటుందని, సినీ ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు చేపట్టి, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. సినీ రంగానికి ఊతమిచ్చేలా తమ చర్యలు ఉంటాయని, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఈవిషయంలో ఓ ముందడుగు వేసిందని చెప్పాలి. సాక్షాత్తు ప్రభుత్వమే పిలిచి రెడ్ కార్పెట్ వేస్తామని ఆహ్వానించడంతో టాలీవుడ్ సుముఖంగా స్పందిస్తుందని అందరూ భావిస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని సినీప్రముఖులు, టాలీవుడ్ నిర్మాతలు ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ఏదేమైనా.. ఈ పరిణామాలు ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నాంది పలుకుతుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :