మెగాస్టార్ చిరంజీవిని కలిసిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు
మన తెలుగు సినిమా పాన్ ఇండియారేంజ్ ని దాటి పాన్ వరల్డ్ కి చేరింది. ఇండియన్ సినిమాలో టాలీవుడ్ ఎంతో స్పెషల్ అంటూ జేమ్స్ కామోరూన్ లాంటి దిగ్గజాలే ప్రశంచిన సందర్భం ఉంది. రామ్ చరణ్..ఎన్టీఆర్ లాంటి నటులకు హాలీవుడ్ లో సైతం అవకాశాలు వస్తున్నాయంటే? తెలుగు సినిమా ఏ స్థాయికి చేరిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తాజాగా రష్యా రాజధాని మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసింది.
మాస్కో ప్రభుత్వ సినిమా సలహాదారు జూలియా గోలుబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ సెంటర్ హెడ్, ఫెడరల్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ప్రతినిధి ఎకటెరినా చెర్కేజ్ జాడే, సిట్కోవ్స్కాయ డైరెక్టర్- సార్వత్రిక విశ్వవిద్యాలయం మరియా సిట్కోవ్స్కాయ తదితర బృందం మెగాస్టార్ ఇంట్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో అభివృద్ధి చెందుతున్న భారతీయ - తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరియు రష్యన్ క్రియేటివ్ ఇండస్ట్రీ మధ్య పరిశ్రమ అభివృద్దికి సంబంధించి కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్‌ను ప్రోత్సహించడానికి అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ప్రభుత్వం కల్పిస్తుందని...విరివిగా తెలుగు చిత్రాల షూటింగ్ లు అక్కడ నిర్వహించాలని రష్యా బృందం కోరినట్లు తెలుస్తోంది. అందుకు చిరంజీని సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకరికొకరు సహకరించుకుంటే రెండు పరిశ్రమలు అభివృద్దికి దోహద పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ భేటీకి సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్యా బృందం తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా భావించి చిరుని కలిసినట్లు తెలుస్తోంది. అదే విధంగా రష్యాలో మన తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ఫ మొదటి భాగం అక్కడ రిలీజ్ విషయం తెలిసిందే!.