ఎంఐఎం రిగ్గింగ్ చేసింది: మాధవీలత సంచలన ఆరోపణలు
లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎం రిగ్గింగ్ చేసిందంటూ బీజేపీ అభ్యర్థి మాధవీలత తీవ్ర ఆరోపణలు చేశారు. స్థానిక అధికారుల సహాయంతోనే ఎంఐఎం ఈ కుట్రకు పాల్పడిందని, వెంటనే హైదరాబాద్ నియోజకవర్గానికి రీపోలింగ్ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా.. 13వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 66.03 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఇక ఎప్పటిలాగే హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తక్కువ పోలింగ్ (48 శాతం) నమోదు కాగా.. అందులో చివరి గంటలో ఏకంగా 12 శాతం పోలింగ్ నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపైనే బుధవారం మీడియాతో మాట్లాడిన మాధవీలత.. ఎంఐఎం రిగ్గింగ్ వల్లే ఇలా ఓటింగ్ పెరిగిందన్నారు. ‘‘హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో ఎంఐఎం రిగ్గింగ్ చేసింది. స్థానిక అధికారుల సాయంతో ఎంఐఎం నేతలు ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేశారు. అందుకే చివరి గంటలో 12 శాతం ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికను ఎలక్షన్ కమిషన్ వెంటనే రద్దు చేసి మళ్లీ రీపోలింగ్ జరిపించాలి. అందుకోసం ఎంతదూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా’’ అని మాధవీలత హెచ్చరించారు.