Radha Spaces ASBL

రివ్యూ : మరో హిందూ, ముస్లిం ప్రేమకథ 'లింగోచ్చా'

రివ్యూ : మరో హిందూ, ముస్లిం ప్రేమకథ 'లింగోచ్చా'

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : కార్తీక్ రత్నం, సుప్యర్ధ సింగ్, ఉత్తేజ్, 'తాగుబోతు' రమేష్, కునాల్ కౌశిక్,
'పటాస్' సద్దాం, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు
సంగీతం : బికాజ్ రాజ్, మాటలు : ఉదయ్ మదినేని
సమర్పణ : జె నీలిమ, నిర్మాత : యాదగిరి రాజు
కథ, కథనం, దర్శకత్వం : ఆనంద్ బడా
విడుదల తేదీ: 27.10.2023

'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు కార్తీక్ రత్నం. నితిన్ 'చెక్', 'రౌడీ బాయ్స్' తదితర సినిమాలతో పాటు వెబ్ సిరీస్ 'వ్యవస్థ'లో కీలక పాత్రలు పోషించారు. 'నారప్ప'లో వెంకటేష్ తనయుడిగా కనిపించారు. 'అర్ధ శతాబ్దం', 'చాంగురే బంగారు రాజా' సినిమాల్లో హీరోగానూ నటించారు. కార్తీక్ రత్నం హీరోగా రూపొందిన 'లింగోచ్చా' తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ :

శివ (కార్తీక్ రత్నం) హైదరాబాద్ పాతబస్తీ కుర్రాడు. చిన్న వయసులో నూర్ జహా (సుప్యర్థ సింగ్)ని చూసి ప్రేమలో పడతాడు. శివ అంటే నూర్ జహాకూ ఇష్టం. అయితే... పైకి చెప్పదు. అమ్మాయి ఇంట్లో ఇద్దరి ప్రేమ విషయం తెలిసి గొడవలు అవుతాయి. ఆమెకు పెళ్లి సంబంధం చూస్తారు. ఎంబిబిఎస్ చదివే అమ్మాయి పాతబస్తీలో ఆవారాగా తిరిగే కుర్రాడిని ఎలా ఇష్టపడింది? ఇంట్లో పెళ్లి నిశ్చయించిన తర్వాత లేచిపోదామంటే ఓకే చెప్పిన శివ, దుబాయ్ టికెట్స్ తీసి నూర్ జహాను మాత్రమే పంపించి అతడు ఎందుకు ఆగాడు? నూర్ జహా ప్రేమ కోసం పరితపించిన శివ... ఆమె ఫోన్స్ ఎందుకు అవాయిడ్ చేశాడు? దుబాయ్ నుంచి నూర్ జహా తిరిగి వచ్చిన తర్వాత ఏమైంది? వీళ్ళ ప్రేమ కథ ఏ తీరాలకు చేరింది? ప్రేమికులు ఇద్దరూ కలిశారా? లేదా? చివరకు ఏం జరిగింది? అనేది మిగతా సినిమా.

నటి నటుల హావభావాలు:

శివ పాత్రలో కార్తీక్ రత్నం నటన సహజంగా ఉంది. హైదరాబాదీ యాస నుంచి యువత బాడీ లాంగ్వేజ్ వరకు బాగా పట్టుకున్నారు. ఆవారాగా తిరిగే యువకుడి పాత్రకు పర్ఫెక్ట్ సెట్. అతనికి జోడీగా నూర్ జహా పాత్రలో సుప్యర్థ సింగ్ క్యూట్ & బబ్లీ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. ముస్లిం యువతి పాత్రలో ఒదిగిపోయారు. కార్తీక్, సుప్యర్థ జోడీ బావుంది. హీరో స్నేహితులుగా నటించిన వాళ్ళలో యాదవ్ పాత్రలో బల్వీర్ సింగ్ రెండు మూడు సన్నివేశాల్లో బాగా నవ్వించారు. 'పటాస్', 'జబర్దస్త్' కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న సద్దాంకు నవ్వించే సీన్లు అంతగా పడలేదు. మిగతా నటీనటులు ఓకే. పెద్దగా ఆకట్టుకునే వాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఉత్తేజ్, 'తాగుబోతు' రమేష్ పాత్రలకు, ఈ కథకు సంబంధం లేదు. వారి ద్వారా ఈ కథను చెప్పించారు. తమ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. అయితే... వాళ్లిద్దరి స్థాయికి తగ్గ పాత్రలు కావు.

సాంకేతికవర్గం పనితీరు:

పతాక సన్నివేశాల్లో హృదయాలను కదిలించే సన్నివేశాలతో బరువెక్కిన మనసుతో ప్రేక్షకులు బయటకు వచ్చేలా చేశారు దర్శకుడు ఆనంద్ బడా.  ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయిని దుబాయ్ ఎందుకు పంపించాడు? హీరో ఎందుకు ఆగాడు? అనే విషయం చెప్పడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. దాంతో సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ఆ ల్యాగ్ ఫీలింగ్ పోయేలా చేస్తుంది. పాటలు, కెమెరా వర్క్ బావున్నాయి. కామెడీపై మరింత వర్క్ చేస్తే బావుండేది.

విశ్లేషణ:

సినిమా కంటే ముందు 'లింగోచ్చా' టైటిల్ గురించి చెప్పాలి. తెలంగాణలో వాడుక పదమిది. కొందరికి తెలియకపోవచ్చు. ఏడు పెంకుల ఆటను 'లింగోచ్చా' అంటారు. ఆ ఆట ఆడే సమయంలో అమ్మాయిని చూసి హీరో ప్రేమలో పడటంతో ఆ టైటిల్ పెట్టారు. అసలు కథకు, ఆ పేరుకు సంబంధం లేదు. ఈ కథకు ఒక రకంగా ఆ టైటిల్ మైనస్ కూడా! 'లింగోచ్చా' సినిమా విషయానికి వస్తే... మణిరత్నం 'బొంబాయి' నుంచి మొదలు పెడితే హిందూ, ముస్లిం నేపథ్యంలో ప్రేమ కథలు కొన్ని తెరపై వచ్చాయి. అయితే హైదరాబాద్ నేపథ్యంలో హిందూ యువకుడు, ముస్లిం అమ్మాయి కథను చెప్పడం సినిమాకు కొత్తదనం తీసుకు వచ్చింది. నేటివిటీలో ఉన్న కొత్తదనం కథ, కామెడీ సన్నివేశాల్లో లేకపోవడం, రెగ్యులర్ & రొటీన్ కామెడీ సీన్స్ ఉండటంతో ఫస్టాఫ్ సోసోగా వెళుతుంది. కథతో పాటు సాగే పాటలు కొంత వరకు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ తర్వాత కూడా చాలా సేపు సినిమా సాదాసీదాగా ఉంటుంది. అయితే... ఇటీవల తెలంగాణ నేపథ్యంలో సినిమాలు అంటే మందు మాత్రమే అన్నట్లు చూపించారు. ఆ ఆల్కహాలిక్ సీన్స్ లేకుండా సినిమా తీయడం మంచి విషయం. చివరగా చెప్పేది ఏంటంటే : హైదరాబాదీ లోకల్ ఫ్లేవర్ సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించిన సినిమాలు తక్కువ. 'హైదరాబాద్ నవాబ్స్', 'అంగ్రేజ్' వంటివి వచ్చాయి. 'లింగోచ్చా' ఆ లిస్టులో సినిమాయే. హైదరాబాదీలకు నచ్చే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. సగటు ప్రేక్షకులను ఫస్టాఫ్ కామెడీ కొంత నవ్వించినా ఇంటర్వెల్ తర్వాత సీన్స్ డిజప్పాయింట్ చేస్తాయి. అయితే... ప్రతి ఒక్కరూ బరువెక్కిన మనసుతో బయటకు వచ్చేలా చేస్తుంది క్లైమాక్స్.   

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :