ASBL NSL Infratech

రివ్యూ : ఫీల్ గుడ్ లవ్ ఎమోషనల్ మూవీ గా 'ఖుషి'  

రివ్యూ : ఫీల్ గుడ్ లవ్ ఎమోషనల్ మూవీ గా 'ఖుషి'  

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : మైత్రి మూవీ మేకర్స్,
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, మురళీశర్మ, సచిన్ కేడ్కర్, వెన్నెల కిషోర్, రోహిణి, రాహుల్ రామకృష్ణ తదితరులు.
సంగీతం: హిషామ్ అబ్ధుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ: మురళి.జి, ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్
పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ
విడుదల తేదీ : 01.09.2023

సరిగ్గా 22 ఏళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమికలు నటించిన ‘ఖుషి’ సినిమా ఇండస్ట్రీ రికార్డ్‌లను షేక్ చేసింది. ఇప్పుడు మళ్లీ ‘ఖుషి’ టైటిల్‌తోనే ఈ సినిమా రావడం విశేషం. సినిమా మొదలైన రెండేళ్లకు విడుదలైన ఈ చిత్రం రౌడీ హీరో విజయ్ దేవరకొండకి ఇటు సమంతకి ఆత్మవిశ్వాసం తో కూడుకున్న చిత్రం ఖుషీ. ‘మహానటి’ సినిమా తరువాత విజయ్ దేవరకొండ, సమంత నటించిన రెండో చిత్రం ‘ఖుషి’. హృదమైన ప్రేమకథల్ని మత్తులా ఎక్కించి, ప్రేమకథలను కమర్షియల్ ఎలెమెంట్స్ తో అందించే దర్శకుడు శివ నిర్వాణ,  ప్రేమకథల్నిఇక ముట్టనని శపథం చేసిన విజయ్ దేవరకొండని ఒప్పించి మరీ మళ్లీ లవ్ ట్రాక్ ఎక్కించారు దర్శకుడు శివ. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ మ్యాజికల్ అండ్ మ్యూజికల్  లవ్ స్టోరీకి.. విజయ్, సమంతలను పెయిర్‌గా ఎంచుకోవడంతోనే సగం సక్సెస్ అయ్యారు శివ. పెయిన్ ఫుల్ ప్రేమకథలకు డ్రైవింగ్ ఫోర్స్ సమంత అయితే.. ర్యాష్ డ్రైవర్ లాంటోడు విజయ్ దేవరకొండ. మరి ఈ ఇద్దరి కలయికలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అందించిన చిత్రం ఖుషి ఈ రోజే విడుదలైంది, మరి ఏ మేరకు ఈ చిత్రం ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం!

కథ :

'ఖుషి' కథ అందమైన కాశ్మీర్‌ లోయల్లో మొదలౌతుంది. విప్లవ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ) బురఖా‌లో ఉన్న బేగం (సమంత)ని చూసి ఇది నా పిల్ల అని ఫిక్స్ అయిపోతాడు. తొలిచూపులోనే బేగం ప్రేమలో పడతాడు విప్లవ్‌‌. అనూహ్య పరిస్థితుల్లో బ్రాహ్మిణ్ అయిన ఆరాధ్య బేగంగా మారాల్సి వస్తుంది. కాకినాడలోని ప్రముఖ ప్రవచన కర్త చంద్రరంగం శ్రీనివాసరావుది (మరళీశర్మ) సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం వారి అమ్మాయి ఆరాధ్య. నాస్తికుడు అయిన లెనిన్ సత్యం (సచిన్ ఖేడేకర్) గారి కొడుకు విప్లవ్. పిల్లికి భిక్షం పెట్టాలన్నా ముహూర్తం చూసే కుటుంబం చంద్రరంగం శ్రీనివాసరావుది. నిజాన్ని నమ్మకం కప్పేస్తే.. ఆ నమ్మకాన్ని మూడనమ్మకం కప్పేస్తుందని బలంగా నమ్మే వ్యక్తి లెనిన్ సత్యం. అలాంటి నాస్తిక కుటుంబం నుంచి వచ్చిన విప్లవ్.. ఆస్తిక కుటుంబం నుండి వచ్చిన ఆరాధ్య‌ను పెళ్లి చేసుకోవడానికి పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. పెద్దల్ని ఎదిరించి మరీ ఆరాధ్య- విప్లవ్‌లు పెళ్లి చేసుకుంటారు.

సహజంగా ఈ టైపు కథలు చాలా వచ్చాయిలెండి. ఆ తరువాత మొదలౌతుంది అసలు కథ. విప్లవ్, ఆరాధ్యలు పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండలేరని.. వారికి గండం ఉండదని పెళ్లైనా వారికి పిల్లలు పుట్టరని.. కాపురంలో సమస్యలు వస్తాయని ముందే హెచ్చరిస్తాడు ఆరాధ్య తండ్రి చంద్రరంగం. అయినా ఆ మాటని పట్టించుకోకుండా ఏడాది లోపల మనలాంటి జంట ప్రపంచంలోనే లేదని నిరూపించాలని విప్లవ్ చేయిపట్టుకుని ఇల్లు వదిలి వచ్చేసి  విప్లవ్‌ని పెళ్లాడుతుంది ఆరాధ్య. కొత్త కాపురం, కొత్త ఇల్లు అంతా ఫుల్ ‘ఖుషి’ అనుకున్న టైంలో విప్లవ్, ఆరాధ్యల కథ కొత్త మలుపులు తిరుగుతుంది. చివరికి విప్లవ్ - ఆరాధ్య కథ సుఖాంతం అయ్యిందా? లేదంటే విడిపోయి ఎవరి దారి వాళ్లు చూసుకున్నారా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల హావభావాలు:

విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరు  కూడా తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇద్దరూ సంఘర్షణని నిజంగా అనుభవిస్తున్నట్టుగా జీవించేశారు. అలాగే శివ నిర్వాణ రాసిన కథ మరియు పాత్రలు కూడా కొత్తగా పెళ్లి అయిన వారి జీవితాల్లోని సంఘటనలు పరిస్థితుల ఆధారంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. భర్త పాత్రలో విజయ్ దేవరకొండ చక్కని నటనను కనబరిచాడు. పెళ్లి అయిన తర్వాత ఓ సగటు భర్తగా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో హోమం సీక్వెన్స్ లో అలాగే సమంత వెళ్ళిపోయాక వచ్చే సీన్స్ లో విజయ్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. అలాగే విజయ్ కి, సమంతకి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా అలరిస్తుంది. కథానాయకగా నటించిన సమంత తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. ఖుషి సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ పెయిర్ పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యింది.  

‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమర్ లవర్’, ‘లైగర్’.. హ్యాట్రిక్ డిజాస్టర్స్ తరువాత చేస్తున్న ‘ఖుషి’తో హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమా చేసాడు విజయ్. తనకి ఆరోగ్యం సహకరించకపోయినా.. ‘ఖుషి’ సినిమాని ఎలాగైనా కంప్లీట్ చేయాలని పట్టుదలగా ఈ సినిమా చేసింది సమంత. ఇక మురళీశర్మ, సచిన్ ఖేడేకర్‌లు ఈ కథలో మూల స్తంభాలుగా నిలిచారు. మురళీశర్మ అయితే.. ప్రవచన కర్తగా ఆ పాత్రలో ఒదిగిపోయారు. సైన్స్ గొప్పదా? శాస్త్రం గొప్పదా అంటూ వీరి మధ్య నడిచే రసవత్తర పోరు.. భిన్న వాదనలకు తావిచ్చినా.. ఆయా పాత్రల్ని మాత్రం పర్ఫెక్ట్‌గా డీల్ చేసి పూర్తి న్యాయం చేశారు. మరో ఇంపార్టెంట్ రోల్‌లో రోహిణి జీవించేసింది. ఆమె తన కూతురి సెంటిమెంట్ సీన్‌తో కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతికవర్గం పనితీరు:

నిన్నుకోరి, మజిలీ వంటి హిట్ చిత్రాలను తీసి 'టక్ జగదీష్' సినిమా డిజాస్టర్ తరువాత ‘ఖుషి’ చేసేందుకు ఫ్లాప్స్‌లో ఉన్న అటు సమంత, విజయ్ దేవరకొండల్ని ఒప్పించారు దర్శకుడు శివ నిర్వాణ. రొటీన్ ఇంపాక్ట్ కథని డిస్ట్రబ్ చేయకుండా పవర్ క్యాస్టింగ్‌తో బ్యాలెన్స్ చేసేస్తుంటాడు శివ. తొలి చిత్రం నుంచి ఫీల్ గుడ్ అనేట్టుగా అన్ని వనరుల్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటాడు. ఏ దర్శకుడికైనా తన కథకి తగ్గ పాత్రల్ని ఎంచుకోవడంతోనే సగం సక్సెస్‌ని అందిపుచ్చుకున్నట్టు. శివ నిర్వాణ తొలి నుంచి ఈ విషయంలో మాత్రం మెచ్యూర్డ్ స్టోరీ టెల్లర్ అనే చెప్పాలి. కథ కాశ్మీర్  నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోవడం. ఫస్టాఫ్ అంతా ఇలా చకచకా పరిగెత్తడం.  

ఇంటర్వెల్ తరువాత అసలు కథ మొదలవడం, లవ్‌లో పడ్డ జంటను విడగొట్టడానికి చిన్న ఇన్సిడెంట్ చాలు.. కానీ ఆ జంటను కలపడమే పెద్ద టాస్క్. అందులోనూ రొటీన్ లవ్ స్టోరీలో ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే అంశాన్ని చొప్పించి మెప్పించడం అంటే చిన్న విషయం కాదు. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా.. చూసిన కథే కదా? అని  సింపుల్‌గా తేల్చి పారేస్తారు. కాబట్టి, ఆడియన్స్‌ని  హార్ట్ చేయకుండా ఖచ్చితంగా ఏదో ఒక బలమైన  బేస్ కావాలి.. ఈ కథలో అలాంటి స్ట్రాంగ్  బేస్ పాయింటే శాస్త్రం, సైన్స్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రేమకథను అల్లాడు శివ నిర్వాణ. ఖుషి సినిమాతో మరో టాలెంటెడ్ సంగీత దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం అయినా హిషామ్ అబ్ధుల్ వహాబ్ అందించిన అన్ని పాటలు బాగున్నాయి. ఈ సాంగ్స్ అన్నింటినీ, దర్శకుడు శివ నిర్వాణ రాయడం మరో విశేషం! అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ఇంకా  ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. నిర్మాతలు నవీన్ ఎర్నేని-వై.రవిశంకర్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

గుడ్ కాన్సెప్ట్ తో పాటు ఫీల్ గుడ్ లవ్ సీన్స్ మరియు ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ ఎమోషన్స్.. అలాగే డీసెంట్ గా అనిపించే నటీనటుల పనితీరు ఈ ఖుషికి హైలైట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ఓ ఆస్థికుడు ఓ నాస్తికుడి మధ్య జరిగిన సంఘర్షణ..ఈ  ప్రేమ కథలో కాన్ ఫ్లిక్ట్ ను పెంచడం చాలా బాగుంది. అలాగే కొన్ని రొటీన్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే, విజయ్ దేవరకొండ,  సమంత తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ ఖుషి అన్ని వర్గాల  ప్రేక్షకులను అలరిస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :