ASBL NSL Infratech

బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి..! పార్టీ మనుగడ కోసం కేటీఆర్ ఆపసోపాలు !!

బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి..! పార్టీ మనుగడ కోసం కేటీఆర్ ఆపసోపాలు !!

 

తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ టీఆర్ఎస్. పార్టీ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలిగారు. పదేళ్లపాటు అధికారాన్ని కూడా అనుభవించారు. తెలంగాణ ఉన్నంతకాలం తమకు తిరుగుండదని భావించారు కేసీఆర్. అయితే పదేళ్లకే ఆ పార్టీని ఇంటికి పంపించారు తెలంగాణ ప్రజలు. ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే పట్టుదలతో పని చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పార్టీని కాపాడుకునేందుకు కేటీఆర్ తెరవెనుక సర్వసన్నద్ధమవుతున్నట్టు సమాచారం.

ఉద్యమపార్టీగా టీఆర్ఎస్ కు పేరుంది. అయితే తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్.. దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ ను విస్తరించాలనే ఆలోచనతో పార్టీ పేరు కూడా మార్చేశారు. భారత్ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం పనిచేశారు. బీజేపీపై యుద్ధం ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం పాటిస్తూ ఇతర పార్టీలను కలుపుకుపోవాలని ఆశించారు. అయితే అది వర్కవుట్ కాలేదు. ఇంతలోనే తెలంగాణ ఎన్నికల్లో కూడా ఓటమి పాలవడంతో కేడర్ మొత్తం పూర్తిగా డీలా పడిపోయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ తన్నుకుపోతోంది. నాడు కాంగ్రెస్ పార్టీకి ప్రతపక్షహోదా లేకుండా చేయడంతో ఇప్పుడు బీఆర్ఎస్ కు కూడా లేకుండా చేయాలనే పట్టుదలతో పనిచేస్తోంది కాంగ్రెస్.

ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. రోజుకొకరు చొప్పున పార్టీ మారుతున్నారు. త్వరలోనే మరికొంతమంది నేతలు కూడా పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎక్కువ మంది నేతలు కాంగ్రెస్ లోకి, కొంతమంది బీజేపీలోకి వెళ్తారనే టాక్ నడుస్తోంది. పార్టీలో ఎవర్నీ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ కలిసిన వాళ్లు తెల్లారేసరికి పార్టీ మారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేడర్ ను కాపాడుకోవడం అంత ఈజీ కాదనే విషయం బీఆర్ఎస్ హైకమాండ్ కు అర్థమైపోయింది. అందుకే సరికొత్త పంథాతో ముందుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. నాడు ఎన్టీఆర్ అనుసరించిన మార్గాన్ని ఫాలో అయ్యేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

కేసీఆర్ వయసు మీద పడింది. ఆరోగ్యం కూడా గొప్పగా లేదు. దీంతో పార్టీ బాధ్యతలను కేటీఆర్ మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో సీనియర్ నేతలంతా పార్టీ వీడిపోతుండడంతో కొత్త నేతలకోసం వెతుకులాట మొదలు పెట్టాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఇందుకోసం కేటీఆర్ అవసరమైతే పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రం లోకి వెళ్లి ఔత్సాహిక యువతీయువకులను రాజకీయాల్లోకి తీసుకొస్తారనే టాక్ పార్టీలో నడుస్తోంది. ఇది కూడా అంత ఆషామాషీ వ్యవహారం కాదు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి వెళ్లేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ప్రతిపక్షంలో ఉంటే ఇబ్బంది పడ్తామనే భావన ఉంటుంది. అలాంటప్పుడు వాళ్లను పార్టీలోకి తీసుకొచ్చి మనుగడ సాగించడం అనేది అంత సులువు కాదు. మరి కేటీఆర్ ఎలా గట్టెక్కిస్తారనేది వేచి చూడాలి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :