బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డే ఎక్కువ కష్టపడ్డాడు: కేటీఆర్ సెటైర్
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీని గెలిపించడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కంటే కూడా కాంగ్రెస్ నేత, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే ఎక్కువ కష్టపడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు పేల్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలలుగా టైం పాస్ చేస్తూ.. మేడిగడ్డ, శ్వేతపత్రాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలతో ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నించిందని ఆయన మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా, ఎన్డీఏ కూటములకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి ఏ మాత్రం లేదని, రెండు కూటములలో లేని బీఆర్ఎస్, వైఎస్సార్‌సీపీ, బీజూ జనతాదళ్ వంటి ప్రాంతీయ శక్తులే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నాయని జోస్యం చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ సైనికులు అద్భుతంగా పోరాడారని, వారి పోరాట ఫలితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లలో విజయం సాధించబోతోందన్న కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీనే సాధిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్‌పై విమర్శలు చేయడానికి, కేసీఆర్‌ను దూషించడానికే పరిమితం అయ్యాయి. తెలంగాణకు ఏం చేయకపోయినా అడ్డగోలు విమర్శలకు దిగాయి. వీరి వల్ల తమకు ఎలాంటి మేలు జరగదని ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని వాళ్లంతా నిర్ణయించుకున్నారు. వాళ్ల ఓట్లతోనే బీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోంది’’ అంటూ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.