మాది మేనేజ్ మెంట్ కోటా అయితే.. రాహుల్, ప్రియాంకా ది ఏం కోటా?
తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీకు ధైర్యముంటే సీఎం, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందాం అని ప్రతి సవాల్ విసిరారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ముందు రైతులకు రూ.2 లక్షల రుణమాపీ చేయాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలకు రూ.2,500 సహా ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని హితవు పలికారు.
మాది మేనేజ్‌మెంట్ కోటా అయితే రాహుల్, ప్రియాంక గాంధీది ఏం కోటా? రేవంత్‌ది పేమెంట్ కోటానా? అలా సీటు తెచ్చుకున్నందుకు రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాలి. బ్యాగులు మోయాలి. ఇందుకోసం బిల్డర్లు, వ్యాపారులను బెదిరించాలి. అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపారు. ఇప్పటివరకు ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి. త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ తీరును వ్యతిరేకిస్తూ రోడ్డు ఎక్కుతారు. ఆయనే సీఎం అన్ని ఎన్ని సార్లు చెబుతారు. ఆయనకు తానే సీఎం అన్న నమ్మకం లేదా? మా ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. పాలనలో అన్నీ సీఎం, మంత్రులకు తెలియాలని లేదు. తప్పులు జరిగాయనుకుంటే విచారించి చర్యలు తీసుకోండి అని తెలిపారు.