పాదయాత్ర చేస్తా.. ఆ పదవే తనను వెతుక్కుంటూ వస్తుంది

తాను కూడా పాద యాత్ర చేపట్టనున్నట్టుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను గజమాలతో సత్కరించి కేకు కట్ చేయించారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు సీఎం పదవి అవసరం లేదంటూనే, ఆ పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తామని ప్రకటించారు. జూన్ లో ప్రియాంక గాంధీ నల్గొండకు వస్తారని తెలిపారు. తన బర్త్ డే వేడుకలు బల ప్రదర్శనకు వేదిక కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేయనున్నట్టుగా కోమటిరెడ్డి ప్రకటించారు.