చంద్రబాబుపై కోడెల శివరాం హాట్ కామెంట్స్..! సత్తెనపల్లి టీడీపీలో కలకలం!!

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి టీడీపీ దాదాపు ఏడాది ముందే అభ్యర్థిని ఖరారు చేసింది. సత్తెనపల్లి ఇన్ ఛార్జ్ గా కన్నా లక్ష్మినారాయణను నియమించి.. ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థి అని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో సత్తెనపల్లి టికెట్ ఆశిస్తున్న కోడెల శివరాం రగిలిపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా సత్తెనపల్లి నుంచి తమ కుటుంబం పోటీ చేస్తోందని... ఇప్పుడు మరొకరికి ఆ టికెట్ ఇవ్వడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కన్నా లక్ష్మినారాయణకు కోడెల శివరాం సహకరిస్తారా.. లేకుంటే వ్యతిరేకిస్తారా.. అనేది అర్థం కావట్లేదు.
సత్తెనపల్లి నుంచి గతంలో టీడీపీ తరపున దివంగత నేత కోడెల శివప్రసాద్ ఎన్నికయ్యారు. స్పీకర్ గా పని చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో సీనియర్ నాయకుడ్ని టీడీపీ కోల్పోయింది. సత్తెనపల్లి నుంచి గత ఎన్నికల్లో శివరాం పోటీ చేసి ఓడిపోయారు. ఆయన స్థానంలో కుమారుడు కోడెల శివరాం పార్టీ బాధ్యతలు చూస్తూ వస్తున్నారు. ఈసారి కూడా టికెట్ తనదేనని ఆశించారు. అయితే శివరాంతో పాటు మరో ఇద్దరు కూడా సత్తెన పల్లి టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇది అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.
ఇప్పుడు ఆ ముగ్గురికీ కాదని ఇటీవలే బీజేపీ నుంచి వచ్చిన సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణకు టికెట్ ఖరారు చేశారు చంద్రబాబు. ఇది కోడెల శివరాంకు అస్సలు నచ్చట్లేదు. ఎంతోకాలంగా తాను ఇక్కడ పార్టీకోసం పని చేస్తున్నానని.. ఇప్పుడు కన్నా లక్ష్మినారాయణకు టికెట్ ఖరారు చేయడం సరికాదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు.. తాను మూడేళ్లుగా చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని... అయినా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిని కూడా కలవకుండా తమ కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని శివరాం ఆరోపించారు. ఇప్పుడు టీడీపీలో కోడెల శివరాం వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.
ఒకప్పుడు చంద్రబాబుకు కోడెల శివప్రసాద్ కుడిభుజంగా వ్యవహరించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. అయితే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ కుటుంబంతో చంద్రబాబు అంటీముట్టనట్టు ఉంటున్నారు. కోడెల శివరాం గత ఎన్నికల్లో ఓడిపోవడం, అంతేకాక స్థానికంగా శివరాంపై వ్యతిరేకత బలంగా ఉండడంతో చంద్రబాబు ఇక్కడ సరైన అభ్యర్థికోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో కన్నా లక్ష్మినారాయణ పార్టీలోకి రావడంతో వెంటనే ఆయనకు సత్తెనపల్లి స్థానాన్ని కేటాయించారు. కన్నా కూడా సత్తెనపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక్కడ టీడీపీ బలమైన అభ్యర్థి దొరికినట్లయింది. దీంతో కోడెల శివరాంకు ఈసారి నిరాశ తప్పలేదు. అయితే ఆయన తదుపరి ప్రయాణం ఎటు అనేది ఆసక్తి కలిగిస్తోంది.






