అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండికి చెందిన కిరణ్ అమెరికాలో మరణించాడు. నవంబర్‌లో అమెరికా వెళ్లిన అతడు, మిస్సోరీ స్టేట్‌లో శ్యాండిల్ ఎస్ టౌన్‌లో ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. ఆదివారం కిరణ్ తాను నివసిస్తున్న ప్రదేశానికి సమీపంలో ఈత కొట్టేందుకు ముగ్గురు మిత్రులతో కలిసి వెళ్లాడు. 8 అడుగుల లోతు ఉన్న ఈత కొలనులోకి అంతా దిగారు. పూర్తి లోతుగా వెళ్లిన కిరణ్ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. మిత్రులకు కూడా ఈత రాకపోవడంతో కిరణ్‌ను కాపాడలేకపోయారు. కిరణ్ తండ్రి లక్ష్మణరాజు గతంలో చనిపోగా అతడి తల్లి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కిరణ్ చనిపోయినట్టు సమాచారం అందడంతో కుటుంబంలో విషాదం నెలకొన్నది. మృతదేహం అమెరికా నుంచి స్వగ్రామమైన చిన్నకోరుకొండి గ్రామానికి గురువారం వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు.