ASBL Koncept Ambience
facebook whatsapp X

కేసీఆర్‌ను టెన్షన్ పెడుతున్న దళిత బంధు!?

కేసీఆర్‌ను టెన్షన్ పెడుతున్న దళిత బంధు!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గత తొమ్మిదేళ్లలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులే ఈసారి తమను మళ్లీ అధికార పీఠానికి దగ్గర చేస్తాయని ఆయన నమ్ముతున్నారు. అయితే ఎంత అభివృద్ధి చేసినా ఎక్కడో ఒక చోట కాస్త అసంతృప్తి ఉండడం సహజమే. ఈ ప్రభుత్వ వ్యతిరేకతే పార్టీల కొంప ముంచుతుంటాయి. ఇప్పుడు అలాంటి టెన్షనే కేసీఆర్ కు పట్టుకుంది. చాలా చేశానని కేసీఆర్ చెప్పుకుంటున్నా కొన్ని అంశాలు ఆయన పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. అలాంటి వాటిలో ముందుంది దళిత బంధు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ఇప్పుడు కేసీఆర్ పార్టీపై తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళితబంధు పథకాన్ని అనౌన్స్ చేశారు కేసీఆర్. దీని ద్వారా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఇది నిరంతర ప్రక్రియ అని దశలవారిగా అన్ని దళిత కుటుంబాలకు ఈ లబ్ది చేకూరుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం. అంటే నియోజకవర్గంలో సరాసరిన 14వేల కుటుంబాలు ఉంటాయి. వీళ్లందరికీ ఒకేసారి పది లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయడం చాలా కష్టం. అందుకే మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో 1100 కుటుంబాలకు లబ్ది చేకూరేలా చూడాలని ఆదేశించింది ప్రభుత్వం.

దళితబంధు లబ్దిదారుల ఎంపికను స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులకు అప్పగించి ప్రభుత్వం. నియోజకవర్గంలో 1100 దళిత కుటుంబాలను ఎంపిక చేయడం ఎమ్మెల్యేలకు పెద్ద సవాల్ గా మారింది. కొందరిని ఎంపిక చేస్తే మిగిలిన వాళ్లు అసంతృప్తికి లోనవుతున్నారు. అయిన వాళ్లకే ఇచ్చుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. దళితబంధులో 30శాతం కమిషన్ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు నేరుగా ప్రగతి భవన్ కే అందుతున్నాయి. తమను ఎంపిక చేయాలనే వినతులు ఓ వైపు, అవినీతి ఆరోపణలు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చుట్టుముడుతున్నాయి. ఎన్నికల వేళ ఈ సమస్యలు తమ కొంప ముంచుతాయేమోనని వాళ్లు ఆందోళన చెందుతున్నారు.

 

దళిత బంధు పథకంపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. లబ్దిదారుల ఎంపికపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ అనుకూల దళిత కుటుంబాలను మాత్రమే ఎంపిక చేస్తున్నారని, మిగిలినవాళ్లను పట్టించుకోవట్లేదనే ఆరోపణలున్నాయి. ఎన్నికల్లో దళితులు నిర్ణాయకశక్తులు. కాబట్టి ఎంపిక కాని దళితులు తమకు వ్యతిరేకంగా పని చేస్తారేమోననే భయం కేసీఆర్ కు పట్టుకుంది. అలా అని ఇప్పటికిప్పుడు అందరికీ పథకాన్ని అమలు చేసే అవకాశం లేదు. ఎన్నికల ముంగిట దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక కేసీఆర్ తీవ్రంగా మథన పడుతున్నట్టు సమాచారం. మరి చూడాలి ఏం జరుగుతుందో.!

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :