గులాబీ బాస్ కీలక నిర్ణయం... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా రావడంతో గులాబీ బాస్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలకు ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. బీఆర్‌ఎస్ అధినేత వైఖరితో పాటు పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనంతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ లోపల, బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారపూరిత వైఖరి పార్టీకి నష్టం చేస్తుందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేటీఆర్‌ను పార్టీలో కీలక బాధ్యతల నుంచి మార్చాలని గులాబీ బాస్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ స్థానంలో కుటుంబంలోనే మరొకరికి కేటాయించాలా లేదా బయట వ్యక్తులకు అప్పగించాలా అనే దానిపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు హరీష్‌రావుకు అప్పగించాలని లేదంటే ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్నది ఎన్నికల కాలం కావడంతో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాగలిగే నాయకులు ఎవరనేదానిపై గులాబీ బాస్ ఫోకస్ చేశారట.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ స్థానిక సంస్థల్లో బలపడే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవని, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నుంచి పోటీ ఉంటుందని ఇద్దరి మధ్య పోటీని తట్టుకుని పార్టీని గెలుపువైపు తీసుకెళ్లగలిగే నాయకుడికి కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే బీఆర్‌ఎస్ సంస్థాగత మార్పులు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.