ASBL NSL Infratech

కేసీఆర్ అసెంబ్లీకి రారా...?

కేసీఆర్ అసెంబ్లీకి రారా...?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ కేడర్ డీలా పడింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పుడే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేసి ఎర్రవల్లిలోని ఫాంహౌస్ కు వెళ్లిపోయారు. ఆ తర్వాత రెండ్రోజులకే కాలు విరగడంతో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకున్నారు. అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణం కూడా చేశారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని అనుకున్నారు. అసెంబ్లీలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఫైట్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఉబలాటపడ్డారు. అయితే అది నిరాశగానే మిగిలిపోతోంది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. సమావేశాల కంటే ముందే కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అంతకుముందే ఆయన్ను శాసనసభా పక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో ఆయన అసెంబ్లీకి వస్తారని.. మాటల దాడి చేస్తారని అనుకున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాత్రను చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అసెంబ్లీ ప్రారంభమైనా కూడా కేసీఆర్ మాత్రం అడుగు పెట్టలేదు. ప్రతిరోజూ కేసీఆర్ ఈరోజైనా వస్తారా.. రారా.. అని అందరూ ఆరా తీస్తున్నారు. మీడియా కూడా కేసీఆర్ రాకకోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

నీటిపారుదల శాఖపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ప్రభుత్వం పూర్తిగా కేసీఆర్ నే టార్గెట్ గా చేసుకుంది. మొదటి టర్మ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరే నీటి పారుదల శాఖను ఉంచుకున్నారు. రెండోసారి ఆ బాధ్యతలను హరీశ్ రావు చూశారు. కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరానికి పునాదులు పడ్డాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఏపీలో నీటిపంపకాలపైన కూడా బీఆర్ఎస్ ను దోషిగా చూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి ఆధారాలు సహా ప్రజెంట్ చేస్తోంది. జగన్, రోజా తదితరులతో స్నేహం చేసిన కేసీఆర్.. రాష్ట్ర నీటి వాటాలను ఫణంగా పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ నేతలు ఎంతో ప్రయత్నిస్తున్నారు. అయినా అధికారపార్టీ సభ్యులు మాత్రం కేసీఆర్ నే టార్గెట్ గా చేసుకుంటున్నారు. చేసిన తప్పులను ఎదుర్కోవడం చేతకాకే ఆయన అసెంబ్లీకి రావట్లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ధారదత్తం చేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నల్గొండలో సభ పెడ్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రానప్పుడు నల్గొండ సభకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దీంతో సభలో కేసీఆర్ లేకపోయినా మాటల దాడి మాత్రం ఆయన చుట్టూనే తిరుగుతోంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :