ASBL NSL Infratech

కేసీఆర్ పయనమెటు..? దారులన్నీ మూసుకుపోయాయా..?

కేసీఆర్ పయనమెటు..? దారులన్నీ మూసుకుపోయాయా..?

దేశంలో పలు రాజకీయ సంచలనాలకు తాజా సార్వత్రిక ఎన్నికలు నాంది పలికాయి. బళ్లు ఓడలవుతాయి.. ఓడలు బళ్లవుతాయి.. అన్నట్టు కొందరి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. మరికొందరిది కొంతకాంతులీనుతోంది. ఇన్నాళ్లు తమకు తిరుగే లేదనుకున్న బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఆయన తదుపరి ప్రయాణం ఎటు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో ఎవరితో కలిసి ముందడుగు వేస్తారు.. లేకుంటే ఇప్పటిలాగే ఒంటరిగానే పయనిస్తారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తెలంగాణను పదేళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణను అభివృద్ధి చేసేశానని.. ఇక దేశాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందంటూ ఆయన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. 2023 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 2024 లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేయాలని కలలు కన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆరు కలలు అడియాశలయ్యాయి. ఇక తాజా లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఆ పార్టీకి రాకపోవడంతో పార్లమెంటులో ప్రాతినిథ్యమే లేకుండా పోయింది.

అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసిన కేసీఆర్ బీజేపీని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు అదే బీజేపీ ద్వారా బీఆర్ఎస్ కు ముప్పు పొంచిఉంది. చాలా మంది నేతలు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పైగా బీజేపీ అంతు చూస్తానని బెదిరిస్తూ వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుమార్తె కవిత లిక్కర్ స్కాములో జైల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఫ్యోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కు కూడా మున్ముందు ఇబ్బందులు తప్పేలా లేవు.

ఒకవైపు బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటానన్న కేసీఆర్.. ఇప్పుడు ఆ పార్టీతో జతకట్టే అవకాశాలు లేవు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు సంపూర్ణ అవకాశాలున్నాయి. ఇలాంటప్పుడు ఆ పార్టీతో కలిసి ముందుకెళ్లేందుకు బీజేపీ ససేమిరా అంటుంది. మరోవైపు కాంగ్రెస్ కూటమితో కలిసి వెళ్లేందుకు కూడా అవకాశాల్లేవు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ను ముప్పతిప్పలు పెట్టి పార్టీని నిర్వీర్యం చేసింది కేసీఆరే. అలాంటప్పుడు కేసీఆర్ తో కలిసి నడవడం అనే అలోచనే కాంగ్రెస్ పార్టీకి ఉండదు.. ఉండబోదు. ఇలాంటి పరిస్తితుల్లో ఒంటరిగా అడుగు వేయడం తప్ప కేసీఆర్ కు మరో మార్గం కనిపించట్లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :