కవిత కడిగిన ముత్యంలా తిరిగొస్తుంది: కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ స్కాం నరేంద్ర మోదీ సృష్టించిన రాజకీయ కుంభకోణం అంటూ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం ఓ రాజకీయ కుంభకోణం. ఇది ఓ రివర్స్ పొలిటికల్ స్కాం. ఇవాళ్టి వరకు ఒక రూపాయి రికవరీ చేయలేదు. మనీ ల్యాండరింగ్ ట్రేస్ దొరకనేలేదు. ఢిల్లీలోని లిక్కర్ పాలసీని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ కలిసి స్కాం కింద చిత్రీకరించడం జరిగింది’’ అంటూ కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి మోదీ తన ఏజెంట్లను పంపించారని, వాళ్లను తాము జైల్లో పెట్టడంతోనే తనపై కక్ష సాధింపు చర్యలకు బీజేపీ పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. ఆ కోపంతోనే తనపై రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు కవితను అరెస్టు చేశారని, త్వరలో స్కాం లేదని తేలిపోతుందని, కవిత కడిగిన ముత్యంలా తిరిగొస్తుందని కేసీఆర్ అన్నారు.