ASBL NSL Infratech

రివ్యూ: పౌరాణిక, ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ 'కల్కి 2898 AD' అద్భుతం

రివ్యూ: పౌరాణిక, ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ 'కల్కి 2898 AD' అద్భుతం

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5
నిర్మాణ సంస్థ : వైజయంతి మూవీస్,
నటీనటులు : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం, స్వస్థా ఛటర్జీ, పశుపతి, అన్నా బెన్,
అన్నా బెన్, మాళవిక నాయర్, కావ్య రామచంద్రన్ తదితరులు,
సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, పాటలు : రామ్ జోగయ్య శాస్ట్రీ , చంద్ర బోస్,
మాటలు : సాయి మాధవ్ బుర్ర, నిర్మాత : సి. అశ్వనీ దత్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకుడు: నాగ్ అశ్విన్
విడుదల తేదీ: 27. 06. 2024
నిడివి : 3 ఘంటల 56 సెకన్లు

భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న  చిత్రం 'కల్కి 2898 AD'  ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి అగ్ర తారల కలయిక, అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రపంచ పాపులర్ పొందిన సాంకేతికగణం, వెరసి  600 కోట్లకి పైగా బడ్జెట్...తో  ఈ రోజు భారీ లెవల్లో విడుదల అయిన పౌరాణిక, మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్  'కల్కి 2898 AD'  అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమా కు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్  డిజార్డజే స్టోజిల్జ్కోవిచ్, కాగా  భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే బలమైన క్యాస్టింగ్, టెక్నాలజీ, వీఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త ప్రపంచాన్ని చూసిన ప్రేక్షకుడు ఏ తీర్పు ఇచ్చాడో సమీక్షలో చూద్దాం.  

కథ :

వైజయంతి బ్యానర్ లో వుండే శంఖం పూరించే కృష్ణ పాత్రధారి ఎన్టీర్ తో చిత్రం మొదలవుతుంది.  "అశ్వత్థామ హతః కుంజరః" అనే డైలాగ్‌తో కురుక్షేత్ర యుద్ధభూమిలో  తమ సకల సైన్యాన్ని కోల్పోయి.. నా అనుకున్న తన నాన్నని దూరం చేసుకొని తీరని ఆక్రోశంతో రణభూమిలో రగిలిపోతుంటాడు అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్). తనవాళ్లు అందరినీ చంపేసిన పాండవులకి వారసుడే ఉండకూడదనే పగతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర (మాళవిక నాయర్) గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు అశ్వత్థామ. దీంతో ఉత్తర గర్భంలోని శిశువు మరణిస్తాడు. ఇది తెలిసి యుద్ధభూమిలోకి శ్రీకృష్ణ పరమాత్మ (మొఖం చీకటి చేసారు) వస్తాడు. "రా కృష్ణ.. ఇక మిగిలింది నేనే నన్ను కూడా అంతం చేస్తావా" అంటూ కృష్ణుడిపైనే దాడి చేయబోతాడు అశ్వత్థామ. వెంటనే పక్కకి తప్పుకొని "నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటావ్ అశ్వత్థామ.. గర్భంలోని పిండంపైనే అస్త్రాన్ని సంధించావ్ కదా.. కనుక నీకు చావు అనేదే లేకుండా నేను శాపం ఇస్తున్నాను.. ఇది శాపం ఎలా అనుకుంటున్నావేమో.. కలియుగాంతం వరకూ నువ్వు కొండ కోనల్లో ఇలానే తిరుగుతావ్.. నీ శరీరం నుంచి చీము, రక్తం స్రవిస్తాయి.. అయినా సరే నీకు చావు దరిచేరదు" అంటూ అశ్వత్థామ నుదిటిపై ఉండే ప్రకాశవంతమైన మణిని తీసేసుకుంటాడు కృష్ణుడు. దానికి అశ్వత్థామ "దీనికి ప్రాయశ్చిత్తమే లేదా"? అని ప్రాధేయపడతాడు. "ఉంటుంది కలియుగాంతం కలియుగాంతంలో పాపం మితిమీరిపోతుంది.. యాగాలు, యజ్ఞాలు కూడా ఆగిపోతాయి.. గంగానది చివరి బొట్టు కూడా ఎండిపోతుంది.. ఎక్కడ చూసినా అధర్మం తాండవం చేస్తుంది.. అప్పుడు నేను మరో అవతారం ఎత్తుతాను. కానీ నన్ను పుట్టకుండా ఆపే శక్తి కూడా 'కలి'కి ఉంటుంది. నాపైన ఇప్పుడు దాడి చేయడానికి ప్రయత్నించినా నువ్వే ఆ రోజు తల్లి గర్భంలో ఉన్న నన్ను కలి నుంచి కాపాడాలి.. సమయం వచ్చినప్పుడు ఈ మణి తిరిగి నీ దగ్గరికి చేరుతుంది."  కృష్ణుడు అంటాడు. ఇదీ కురుక్షేత్రంలో జరిగిన సన్నివేశం కట్ చేస్తే... కురుక్షేత్రం జరిగిన జరిగిన 6 వేల సంవత్సరాల తర్వాత అంటే  '2898 ఏడీ'లో ప్రపంచం ప్రమాదకరంగా ఉంటుంది,

ఎక్కడ చూసినా నీళ్లు లేక తిండి లేక జనాలు అలమటిస్తూ ఉంటారు. ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో, ఆనాటి  కాశీ పట్టణం ఒక్కటి మాత్రమే ఉంటుంది.   ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ భూమి నుంచి వనరులు అన్నీ లాగేసుకొని 'కాంప్లెక్స్' (తలక్రిందులుగా వుండే పిరమిడ్ నగరం) అనే ఓ సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్). కాశీ పట్టణంలో ఉన్న ప్రజలకి సుప్రీమ్ ఆర్మీ నరకం చూపిస్తూ ఉంటుంది. శరణార్థులను కాశీ నగరంలో పురుగుల్లా చూస్తుంటారు సుప్రీమ్ సైన్యం. అయితే ఫెర్టిలిటీ (సంతాన ఉత్పత్తి) ఉన్న అమ్మాయిలను బలవంతంగా కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లి వారిపై ఓ ప్రయోగం చేస్తుంటారు సుప్రీమ్ ఆర్మీ. దాని పేరే ప్రాజెక్ట్ కే. సుప్రీమ్ యాస్కిన్ ఇచ్చిన ఫార్ములాను ఫెర్టిలిటీ ఉన్న అమ్మాయిల గర్భంలో ఇంజెక్ట్ చేస్తుంటారు. దాన్ని కనీసం 120 రోజులు మోయగలిగే అమ్మాయి గర్భం నుంచి సీరమ్‌ను కలెక్ట్ చేసి ఆ అమ్మాయిలను అగ్ని గుండంలో వేయాలన్నది  సుప్రీమ్ ఆదేశం. కానీ ఆ ఫార్ములాను 100 రోజులు కూడా ఏ అమ్మాయి మోయలేకపోతుంది. కానీ అదే  కాంప్లెక్స్‌లోనే పని చేసే సుమతి (దీపిక పదుకొణె) మాత్రం 150 రోజులు దాన్ని ఎవరికీ తెలియకుండా మోస్తూ జాగ్రత్తపడుతుంది.

మరోవైపు భైరవ (ప్రభాస్) ఎదైనా పని (భౌంటీ/రివార్డ్) వస్తే దానిని పూర్తి చేసి యూనిట్స్ (డబ్బు) దాచుకుంటూ ఉంటాడు. ఎవరు ఎక్కువ యూనిట్స్ ఇస్తానంటే వారి వైపు పని చేసే నిజాయతీ లేని యోధుడు భైరవ. ఎలాగైనా 1 మిలియన్ యూనిట్స్ సాధించి కాంప్లెక్స్‌లో సెటిలైపోవాలనేది భైరవ కోరిక. దీనికి తన రోబోటిక్  కారు 'బుజ్జి' (అమ్మాయి గొంతు వినిపిస్తుంది ) సాయం చేస్తూ ఉంటుంది. అయితే మరో వైపు రేపటి మంచి కోసం కాంప్లెక్స్‌ను ఎదిరించి 'శంభల' అనే రహస్యమైన నగరంలో పోరాటం చేస్తుంటారు కొంతమంది. దానికి సూత్రధారి మరియమ్ (శోభన) ఎప్పటికైనా భగవంతుడ్ని కనే అమ్మ అక్కడికి వస్తుందని వాళ్ల నమ్మకం. ఇక ఒకరోజు సుమతి 150 రోజుల పాటు గర్భాన్ని మోసిందనే విషయం తెలుసుకున్న కాంప్లెక్స్ సైన్యం ఆమె నుంచి సీరమ్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అక్కడి నుంచి తెలివిగా తప్పించుకున్న సుమతిని శంభల మనుషులు కాపాడి వాళ్ల నగరానికి తీసుకువెళతారు. దీంతో ఆమెను తిరిగి తీసుకువస్తే ఊహించనంత యూనిట్స్ ఇస్తామని కాంప్లెక్స్ సుమతిపై భౌంటీ పెడుతుంది. దీంతో ఆమెను తిరిగి కాంప్లెక్స్‌కి తీసుకురావడానికి భౌంటీ పై  ఆశపడి భైరవ కూడా బయలుదేరతాడు. మరోపక్క  కాంప్లెక్స్ సైనికులు 'శంభల' నగరం పై దండెత్తుతారు.  

అయితే దీనికి ముందుగా శ్రీ కృష్ణుడు చెప్పినట్లు భగవంతుడ్ని కడుపున మోస్తున్న తల్లిని కాపాడేందుకు సమయం ఆసన్నమైందని అశ్వత్థామకి సూచన వస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఓ బాలుడు ద్వారా  తన మణి కూడా తనకి చేరుతుంది. దీంతో సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ రంగంలోకి దిగుతాడు. మరి కాంప్లెక్స్ సైన్యం నుంచి అశ్వత్థామ ఒక్కడూ సుమతిని రక్షించాడా? సుమతిని తిరిగి కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లి యూనిట్స్ సాధిద్దామన్న భైరవ కల నెరవేరిందా? సుమతిని ఎతుకెళ్లడానికి వచ్చిన భైరవ-అశ్వత్థామ మధ్య ఎలాంటి పోరాటం జరిగింది? అసలు ఈ భైరవ ఎవరు? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? సుమతి భగవంతుడ్ని ప్రసవించిందా? ఇవన్నీ తెరపై చూస్తేనే థ్రిల్ గా ఉంటుంది.  

నటీనటుల హావభావాలు:

సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన భైరవ పాత్రలో ప్రభాస్‌ను తప్ప మరెవరినీ ఊహించుకోలేం. ఎందుకంటే సరైన పాత్ర పడితే ప్రభాస్ ఎలా నటిస్తారో వేరే చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కి మళ్లీ ఆ రేంజ్‌ లో హైప్ ఇచ్చిన  పాత్ర ఖచ్చితంగా 'భైరవ' అనే చెప్పాలి. ఇక క్లైమాక్స్‌లో ప్రభాస్ పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ అదిరింది. ఈ సీన్‌ చూసినప్పుడు ఫ్యాన్స్‌ కళ్ల ముందు ఒకసారి బాహుబలి అలా వచ్చి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక మరో పిల్లర్  బిగ్ బి ఆరడుగుల అమితాబ్ బచ్చన్,  ఎనిమిది అడుగుల అశ్వత్థామగా ఓ అద్భుతమైన పాత్రతో అలరించారు. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో అమితాబ్‌ను చూసిన ప్రతిసారి ఆయన ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ రావడం పక్కా. అలానే ఎమోషనల్ సీన్లలో ఆ భావోద్వేగాన్ని కేవలం కళ్లతోనే ఆయన పలికించారు. మరోవైపు సుమతి పాత్రలో దీపిక కూడా ఒదిగిపోయింది. కడుపులో ఉన్న తన బిడ్డను కాపాడుకునేందుకు ఆమె పడిన తపన ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.  కాంప్లెక్స్ సామ్రాజ్య అధినేత  విలన్ సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుడ్ని ఎందుకు తీసుకున్నారా అని ఆడియన్స్‌‍కి సందేహం కలుగుతుంది. ఏ మాత్రం కమలహాసన్ రూపురేఖలు లేని ఓ వికృతమైన  ముసలి వాడిగా చూపించారు. ఇక శోభన, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మృణాల్, దుల్కర్, దిశా పటానీ వంటి నటీనటులు ఆయా పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు. కర్ణుడిగా ప్రభాస్ నటిస్తే...అర్జునుడిగా విజయ్ దేవరకొండ ఓ మెరుపు క్యారెక్టర్ చేసాడు. ఇంకా  సీక్రెట్‌గా ఉంచిన పాత్రలు చాలానే ఉన్నాయి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, ఆర్జీవీ, ఫరియా అబ్దుల్లా, అవసరాల శ్రీనివాస్, కె . వి. అనుదీప్ వంటివారు వున్నారు.  

సాంకేతికవర్గం పనితీరు:

ముఖ్యంగా నాలుగేళ్ల పాటు నాగ్ అశ్విన్ టీమ్ పడిన కష్టం తెరపై క్లారిటీగా కనిపించింది. భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది ఓ ఊహ మాత్రమే!  దాన్ని మనకి నచ్చినట్లుగా ఊహించుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకొని.. పురాణాల్లో రాసున్న ముఖ్యమైన అంశాలను  పరిశోధన చేసి.. చాలా కష్టపడి మూడు సరికొత్త ప్రపంచాలను నాగ్ అశ్విన్ సృష్టించారు. కాంప్లెక్స్, కాశీ, శంభల ఇలా మూడు విభిన్నమైన బ్యాక్ గ్రౌండ్ కనిపిస్తుంది. ఇలా కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్‌కి పరిచయం చేసేందుకు నాగ్ అశ్విన్ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నారు. థియేటర్లో సంతోష్ నారాయణన్ ఇచ్చిన బీజీఎంతో ప్రతీ  సన్నివేశాలు చూసినప్పుడు గూస్‌బంప్స్ వస్తాయి. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం అద్భుతంగా ఉంటుంది.  ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత అశ్వనీ దత్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ భారీ లెవల్లో ఇప్పటివరకు చేయని బడ్జెట్ తో  ఉన్నాయి.

విశ్లేషణ: 

పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం యూనిక్ స్టోరీ థీమ్ తో, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్‌ తో చాలా బాగా ఆకట్టుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్సీ, మరియు అమితాబ్ యాక్షన్, కమల్ డిఫెరెంట్ లుక్, మరియు కథలోని యాక్షన్ అండ్ ఎమోషన్స కూడా చాలా బాగున్నాయి. కాకపోతే, కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపిస్తాయి. కానీ, ఓవరాల్ గా ఈ సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. డౌట్ లేకుండా, వయోభేదం లేకుండా, ఈ సినిమాను చూసేయొచ్చు.  

 
 

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :