ASBL NSL Infratech

రివ్యూ : రజనీకాంత్ వన్ అండ్ ఓన్లీ గా 'జైలర్'

రివ్యూ : రజనీకాంత్ వన్ అండ్ ఓన్లీ గా 'జైలర్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్,
నటులు: రజనీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా భాటియా, సునీల్, మిర్నా మేనన్, వసంత్ రవి, యోగిబాబు,
అతిధి పాత్రల్లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ షార్ఫ్ తదితరులు...
సంగీతం : అనిరుద్ రవిచంద్రన్, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్,
నిర్మాత : కళా నిధి మారన్, దర్శకుడు: నెల్సన్ దిలీప్ కుమార్
విడుదల తేదీ: 10.08.2023

సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమా వస్తుందంటే చాలు అటు తమిళ్ ప్రేక్షకులు, ఇటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. రెండేళ్ల క్రితం వచ్చిన పెద్దన్న చిత్రం తరువాత ఈ రోజు  థియేటర్లలో విడుదల అయినా చిత్రం  జైలర్.  ప్రతిష్టాత్మక సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ లో యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమన్నా ‘నువు కావాలయ్యా.. నువు కావాలయ్యా’ అంటూ ఊపేస్తూ..యువత  ‘జైలర్’ వైపు ఓ చూపు చూసేట్టు, ఓ హైప్ క్రియేట్  చేసింది ఆ పాట. మరి ఈ చిత్రం ప్రేక్షకుడిని ఏ మాత్రం మెప్పించిందో? రివ్యూ లో చూద్దాం!

కథ:

ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) రిటైర్డ్ జైలర్. భార్య, కొడుకు, మనవడితో జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంటాడు. కొడుకుని నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్‌ని చేస్తాడు. తండ్రి మార్గంలోనే అన్యాయాన్ని అస్సలు సహించడు ముత్తు కొడుకు అర్జున్ (వసంత్ రవి). పురాతన దేవాలయాల్లో విగ్రహాలను చోరీ చేసే ముఠాను పట్టుకునే కేసులో దూకుడుగా ఉంటాడు. అయితే అనుకోకుండా.. ముత్తు కొడుకు అర్జున్‌ని స్మగ్లర్స్ చంపేశారనే వార్త బయటకు వస్తుంది. తన కొడుకు ఏమయ్యాడు? చివరికి తన కుటుంబాన్ని ముత్తు ఎలా కాపాడుకున్నాడు? అసలు ముత్తు ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అన్నదే మిగిలిన జైలర్ కథ. ఓ వైపు కుటుంబం.. మరో వైపు హీరో తిరుగుబాటు.. పగ.. ప్రతీకారం.. ప్రతి రివేంజ్ కథలోనూ ఇవి రొటీనే. జైలర్ కూడా ఆ తరహా కథే అయినా.. రొటీన్ ప్లాట్‌ని ఎంగేజింగ్ అండ్ యాక్షన్ డ్రామాగా చూపించారు.

నటి నటుల హావభావాలు :

జైలర్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులను మాత్రం ఉర్రూతలూగించారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ తన ఏజ్‌కి తగ్గ పాత్రని ఎంచుకుని 72 ఏళ్ల వయసులోనూ అదే సూపర్ స్టార్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. రజినీ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన స్టైలిష్ లుక్స్ తో రజినీకాంత్ చాలా బాగా నటించాడు. కథ, కథనం అంతా రెగ్యులర్ సెటప్పే అయినా రజనీమార్క్ స్టైల్‌తో రజనీ ఫ్యాన్స్‌లో ఊపు తెప్పించారు. రజనీకాంత్‌ హీరోయిజమ్‌కి ఫాన్స్‌ పరవశించిపోవడం అనేది కామనే. ఆయన చుట్ట ఎగరేస్తే వచ్చి నోట్లో పడుతుంది.. కళ్ల జోడు ఎగిరొచ్చి కళ్లని ముద్దాడుతుంది.. భుజంపై కండువా గిరాగిరా తిరిగి సరిగ్గా సెట్ అయిపోతుంది. ఆయన నడక.. స్టైల్.. చూసే చూపు.. నవ్వే నవ్వు.. మాట్లాడే మాట.. రజనీ కాకుండా వేరే వాళ్లు చేస్తే మీద చెప్పులు పడతాయి. కానీ ఆయన చేస్తే మాత్రం విజిల్స్ పడతాయి. వేరే వాళ్లు చేస్తే ఓవరాక్షన్ అంటారు.. కానీ రజనీ చేస్తే మాత్రం తలైవా న్యూ అవతార్ అనేట్టుగానే ఉంటుంది.

ఈ సినిమాలో ‘నరసింహా’ లెవల్ క‌మ్ బ్యాక్‌ని గుర్తు చేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అతిధి పాత్రల్లో నటించిన మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. మరో కీలక పాత్రలో నటించిన సునీల్ కూడా చాలా బాగా నటించాడు. తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది. నటన పరంగా ఆమెకు వంకపెట్టే వీలు లేదు కానీ.. రజనీ-రమ్య కాంబో అంటే ప్రేక్షకులకు అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. కానీ ఈ చిత్రం లో సాధారణ గృహిణి పాత్రకే పరిమితం అయ్యింది రమ్యకృష్ణ. తమన్నా స్పెషల్ సాంగ్ బాగుంది. వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ప్రతినాయకుడిగా వినాయకన్ భయపెట్టేశాడు. హింసాత్మక సన్నివేషాలతో రక్తపాతం సృష్టించాడు.

సాంకేతికవర్గం పనితీరు :

కేవలం మూడు చిత్రాలకు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్. రొటీన్ ఫార్మేట్ స్టోరీకి ట్విస్ట్‌లను జతచేసి ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడుగా  సక్సెస్ అయ్యారు.అంతకు ముందు ‘కొలిమావు కోకిల’, ‘ వరుణ్ డాక్టర్’, ‘బీస్ట్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.  రజనీకాంత్ తన 169వ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్‌కి అవకాశం ఇచ్చారు. రజనీకాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో ఇదే తొలి సినిమా కాగా.. దర్శకుడికి ఇది నాలుగో సినిమా.  ప్రీ ఇంటర్వెల్ సీన్.. ప్రీ క్లైమాక్స్ సీన్‌లు ‘జైలర్’లో హైలైట్‌ సీన్లుగా నిలిచాయి. అనిరుద్ రవిచంద్రన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. ‘జైలర్’‌ని ఓ రేంజ్‌లో నిలబెట్టింది. ముఖ్యంగా రజనీకాంత్ ఎలివేషన్స్ సీన్స్‌కి అనిరుధ్ బాదిన బాదుడు మామూలుగా లేదు. నువూ కావాలయ్యా అంటూ సినిమాలో ఒకేఒక పాట ఉన్నప్పటికీ.. పాటల్లేని లోటు అయితే కనిపించదు. బ్యాగ్రౌండ్ స్కోర్‌తోనే అనిరుధ్ మరోసారి తన మార్క్ చూపించారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ప్ర‌తి స‌న్నివేశాన్ని కెమెరామెన్ బాగా విజువ‌లైజ్ చేశారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో కొన్ని సాగతీత సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని కాలనీతి మారన్ నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. ఒకరు మోహన్ లాల్.. మరొకరు శివరాజ్ కుమార్. ఈ ముగ్గురూ.. కలిసి క్లైమాక్స్‌లో చేసిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాని సేఫ్‌లో పడేశాయి. స్టార్ హీరో ఇమేజ్‌లను దర్శకుడు పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. వాళ్లు కనిపించేది కొద్దిసేపే అయినా.. పూనకాలు తెప్పించే యాక్షన్ ఎలిమెంట్స్‌తో మాస్ ఫీస్ట్ ఎలివేషన్స్ కొదువలేకుండా చేశారు. రజనీ, శివ్ కుమార్, మోహన్ లాల్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూస్తుంటే ఫ్యాన్స్‌కి పూనకం అనేట్టుగానే ఉంటుంది. తమిళ ఫ్యాన్స్‌‌కి అయితే కన్నులపండుగే. ఫస్టాఫ్ అంతా చకచకా వెళ్లిపోతుంది. ఎప్పుడైతే ముత్తు కొడుకు అర్జున్ కనిపించకుండా పోతాడో.. కథ వేగం పుంజుకుంటుంది. అప్పటి వరకూ పిల్లిలా ఉన్న ఉన్న ముత్తు.. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా విజృభించే ఇంటర్వెల్ సీన్.. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేస్తుంది. సెకండాఫ్‌లో ఇక టైగర్ విశ్వరూపం చూస్తాం అనుకునే లోపే కథ గాడి తప్పినట్టుగా అనిపిస్తుంది. ఎటు నుంచి ఎటుపోతుందో కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. కొడుకుని వదిలిపెట్టాలంటే.. కిరీటం తెచ్చివ్వమని విలన్లు కండిషన్ పెట్టడం.. దాని కోసం టైగర్ రంగంలోకి దిగి.. కిరీటాన్ని సంపాదించడం.. ఫక్తు రొటీన్ డ్రామాలా అనిపిస్తుంది. కానీ అక్కడే ట్విస్ట్‌లు పెట్టి.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి రజనీ మార్క్ మాయాజాలాన్ని చూపించారు. ఓవరాల్ గా సూపర్ స్టార్ స్టైల్స్ కోసం చూసేవారికి ఆయన అభిమానులను మాత్రమే ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :