Radha Spaces ASBL

రివ్యూ : భయానక కొంప ‘ఇంటి నెం.13’

రివ్యూ : భయానక కొంప ‘ఇంటి నెం.13’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు : రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌, డి.ఎం. యూనివర్సల్‌ స్టూడియోస్‌ కలిసి...  
నటీనటులు: నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌,
నెల్లూరు సుదర్శన్‌, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, గుండు సుదర్శన్‌, దేవియాని తదితరులు
సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌
ఎడిటింగ్‌: సాయినాథ్‌ బద్వేల్‌, మాటలు: వెంకట్‌ బాలగోని, పన్నా రాయల్‌
సమర్పణ: డా.బర్కతుల్లా, నిర్మాత: హేసన్‌ పాషా
రచన, దర్శకత్వం: పన్నా రాయల్‌
విడుదల తేదీ: 01.03.2024
నిడివి: 2 ఘంటల 6 నిమిషములు

హారర్‌ మూవీస్‌ అంటే ఎక్కువ శాతం దెయ్యాలు, ప్రేతాత్మలకు సంబంధించిన కథలతోనే రూపొందుతూ ఉంటాయి. ఇలాంటి కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే కొందరు దర్శకులు వాటిలోనే కొంత వైవిధ్యం వున్న కథలతో, ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌ తీసుకొని కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి దర్శకుల్లో పన్నా రాయల్‌ ఒకరు. ఇంతకుముందు అలాంటి కథాంశాలతోనే 'కాలింగ్‌ బెల్‌', 'రాక్షసి'., వంటి హారర్‌ మూవీస్‌ని తీసి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అనిపించుకున్నారు. ఇప్పుడు తన మూడో చిత్రంగా ‘ఇంటి నెం.13’ను తెరకెక్కించారు. తన గత చిత్రాలకు భిన్నంగా ఉండేలా ఒక కొత్త పాయింట్‌, కొత్త బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకొని ప్రేక్షకుల్ని మరోసారి భయపెట్టే ప్రయత్నం చేశారు పన్నా రాయల్‌. ఈ రోజు మార్చ్ 1న  విడుదలైన ఈ సినిమా ఎలాంటి కథతో రూపొందింది? ప్రేక్షకులకు ఈ సినిమా ఎంత వరకు కనెక్ట్‌ అయింది? ఈ సినిమాతో దర్శకుడు పన్నా రాయల్‌ హ్యాట్రిక్‌ సాధించారా? అనేది సమీక్షలో చూద్దాం.

కథ :

సినిమా ఆరంభంలో ఒక 90 ఏళ్ల వృద్ధుడు తన జీవితంలో ప్రేతాత్మల నుంచి ఎంత మందిని విముక్తుల్ని చేశాడో వివరిస్తుంటాడు. అందులో భాగంగా ‘ఇంటి నెం.13’ అనే ఒక విల్లాకు సంబంధించిన కథను చెప్పడం మొదలు పెడతాడు. అర్జున్‌ ఒక రచయిత. అతను రాసిన ఓ నవల 10 లక్షల కాపీలు అమ్ముడు పోయిందంటూ అది ప్రింట్‌ చేసిన పబ్లిషర్‌ ఫోన్‌ చేసి చెబుతాడు. ఆ అచీవ్‌మెంట్‌కి బహుమానంగా ఒక విల్లా బహుమానంగా ఇస్తానంటాడు. దానికి సంబంధించిన తాళాలను తన అన్నయ్య సంజయ్‌కి ఇమ్మని చెబుతాడు అర్జున్‌. అలా సంజయ్‌, అతని భార్య నిత్య, పనిమనిషి జేజెమ్మ ఆ ఇంట్లో దిగుతారు. ఆ తర్వాత అర్జున్‌, నిత్య చెల్లెలు మధు కూడా ఆ ఇంటికి వస్తారు. కొన్ని రోజులు బాగానే గడుస్తుంది. ఆ తర్వాత నిత్యకు తెల్ల ముసుగు వేసుకున్న ఆకారాలు కనిపిస్తుంటాయి. దగ్గరకెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అలాంటివి తరచూ కనిపిస్తుండడంతో ఆమె మానసికంగా ఆందోళనకు గురవుతుంది. ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇది గమనించిన భర్త ఆమెకు చికిత్స చేయించేందుకు డాక్టర్‌ని తీసుకొస్తాడు. ఆ డాక్టర్‌తో కూడా విచిత్రంగా బిహేవ్‌ చేస్తుంది నిత్య. ఆ తర్వాత ఓ సైకియాట్రిస్ట్‌ ఆమె సమస్యను పరిష్కంచేందుకు వస్తాడు. అతనికి కూడా అలాంటి అనుభవమే ఎదురవుతుంది. ఫైనల్‌గా గజానంద్‌(ఆనంద్‌రాజ్‌) రంగంలోకి దిగుతాడు. ఆ ఇంట్లో కనిపిస్తున్న తెల్ల ముసుగు ఆకారాలు ఎవరివి? అవి ఏం సాధించడానికి నిత్యను ఆవహించాయి? ఆ ఇంటిలో ఉన్న సమస్యను గజానంద్‌ ఏవిధంగా పరిష్కరించాడు? అనేది మిగతా కథ.

నటీనటులు :

ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన నవీద్‌, శివాంగి మెహ్రా తమ క్యారెక్టర్స్‌కి పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా శివాంగి మెహ్రా పెర్‌ఫార్మెన్స్‌ సినిమాకి బాగా ప్లస్‌ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో మెయిన్‌ హైలైట్‌ అని చెప్పుకోదగిన గజానంద్‌ పాత్రను ఆనంద్‌రాజ్‌ తనదైన స్టైల్‌లో రక్తి కట్టించాడు. ఇక అతిథి పాత్రల్లో కనిపించిన తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మీ, పృథ్విరాజ్‌, సుదర్శన్‌, శివన్నారాయణ, రవివర్మ వారి పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.

సాంకేతిక నిపుణులు :

ఈ సినిమా టెక్నికల్‌గా కూడా మంచి క్వాలిటీతో రూపొందింది. టెక్నీషియన్స్‌ పరంగా ఈ సినిమాకి ముగ్గురు హైలైట్‌ అయ్యారు. డైరెక్టర్‌ పన్నారాయల్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రాఫర్‌ పి.ఎస్‌.మణికర్ణన్‌ తమ అద్భుతమైన టాలెంట్‌తో సినిమాను ముందుకు నడిపించారు. సినిమాలోని ప్రతి సీన్‌కి వినోద్‌ అందించిన సంగీతం చాలా హైలైట్‌ అయిందని చెప్పాలి. చిన్న సీన్‌ని కూడా బాగా ఎలివేట్‌ చేసేలా అతని సంగీతం ఉంది. ఇక దర్శకుడు పన్నా రాయల్‌ తను అంతకుముందు చేసిన రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఆర్టిస్టుల నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్‌ను రాబట్టుకున్నాడు. పి.ఎస్‌.మణికర్ణన్‌ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో హైలైట్‌గా చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో రిచ్‌గా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఎడిటర్‌ సాయి బద్వేల్‌ ఎక్కడా ల్యాగ్‌ లేకుండా 2 గంటల 6 నిమిషాలకు ఎడిట్‌ చేయడం వల్ల సినిమా చాలా స్పీడ్‌గా అనిపించింది. ఇక వెంకట్‌ బాలగోని, పన్నా రాయల్‌ రాసిన మాటలు కూడా బాగున్నాయి. రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమాను రిచ్‌గా తీశారు. నిర్మాత హేసన్‌ పాషా పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది.

విశ్లేషణ :

మనం ఎప్పుడూ చూసే దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఏ సినిమా అయినా ఒక ఇంట్లో ఉండే సమస్యతోనే మొదలవుతుంది. ఇందులోనూ అలాంటి సమస్యే అయినా దాన్ని చెప్పిన విధానం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ఎండిరగ్‌ వరకు ఎక్కడా బోర్‌ లేకుండా, ల్యాగ్‌ లేకుండా నడిపించడంలో దర్శకుడు పన్నా రాయల్‌ సక్సెస్‌ అయ్యాడు. సినిమాలో అప్పుడప్పుడు వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తాయి. రెగ్యులర్‌ హారర్‌ మూవీస్‌లో చూపించే సమస్యలు కాకుండా కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్‌హాఫ్‌ కంటే సెకండాఫ్‌ ఎంతో గ్రిప్పింగ్‌గా, మరెంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుల్ని సీట్లకు కట్టి పడేసిన మరో అంశం ఏమిటంటే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. వినోద్‌ యాజమాన్య ఇచ్చిన మ్యూజిక్‌ ఎంతో గ్రాండ్‌గా ఉంది.

ఫైనల్‌గా చెప్పాలంటే.. హారర్‌ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. ఒక సీజన్‌లో హారర్‌ సినిమాల హవా నడిచింది. ఆ తర్వాత ఆడియన్స్‌ అందరూ యాక్షన్‌ మూవీస్‌కి షిఫ్ట్‌ అయిపోయారు. ఇప్పుడు ‘ఇంటి నెం.13’ చిత్రం హారర్‌ సినిమాలకు మళ్ళీ శ్రీకారం చుట్టబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేక్షకులు రెండు గంటలపాటు రకరకాల ట్విస్టులతో, అద్భుతం అనిపించే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో థ్రిల్‌ అవుతారు. ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. లాస్ట్‌ సీన్‌ చూసిన తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌ కూడా ఉందని అర్థమవుతుంది. సెకండ్‌ పార్ట్‌ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనే హింట్‌ కూడా ఇచ్చారు దర్శకుడు. కొత్త తరహా సినిమాలను ఇష్టపడే వారికి, యాక్షన్‌ సినిమాలు చూసి చూసి బోర్‌ కొట్టిన వారికి ‘ఇంటి నెం.13’ గొప్ప రిలీఫ్‌ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :