ASBL NSL Infratech

హస్తినలోనే తేల్చుకుంటామంటున్న రైతులు

హస్తినలోనే తేల్చుకుంటామంటున్న రైతులు

కనీస మద్దతు ధరతో పాటు తమ డిమాండ్ల విషయంలో రైతన్నలు గట్టిపట్టుదలతో ఉన్నారు. అవసరమైతే ఢిల్లీ సరిహద్దుల్లో నెలలతరబడి ఉంటామే తప్పా, వెనక్కు తగ్గేది లేదంటున్నారు. మా డిమాండ్లు పరిష్కరిస్తే మంచిది.. లేదంటే ఢిల్లీ వరకూ ర్యాలీకి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులను చల్లబరిచేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఫార్మూలాను.. రైతులు తిరస్కరించారు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. ఇక తమ కార్యాచరణ కొనసాగుతుందని రైతు సంఘాలు క్లారిటీ ఇచ్చాయి.

పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరకు కొంటాయని, ఇందుకోసం ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమని రైతు సంఘాల నేతలకు కేంద్రం ప్రతిపాదించింది. అయితే అది తమకు సమ్మతం కాదని నేతలు తిరస్కరించారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకూ జరిగిన చర్చల సందర్భంగా కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, పీయూష్‌ గోయల్‌, నిత్యానంద్‌ రాయ్‌ ఐదేళ్ల ప్రతిపాదనను రైతు సంఘాల నేతల ముందుంచగా చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని తొలుత రైతు నేతలు తెలిపారు.

ఆ తర్వాత రైతులతో చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు సోమవారం సాయంత్రం ప్రకటించారు. అది రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేదని తెలిపారు. ‘రైతులతోపాటు మా రెండు వేదికల్లో చర్చించాం. అందులో కేంద్రం ప్రతిపాదన రైతులకు ప్రయోజనకరంగా లేదని అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం’ అని జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ వెల్లడించారు. కేంద్రం అంతవేగంగా తమ డిమాండ్లను అంగీకరిస్తుందన్న భ్రమలో రైతు సంఘాలు లేవు. అందుకే ఆరునెలలకు సరిపడా సరుకులు, ట్రాక్టర్లతో వారు.. ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. అక్కడే వంటావార్పు చేసి, ఎండా, వానా, చలిని తట్టుకుంటూ నెలల తరబడి ఆందోళనలకు సిద్ధమయ్యారు.

అంతేకాదు.. ఈసారి డిమాండ్లను ఆమోదించుకునే వెళ్తామంటున్నారు రైతులు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, ఆందోళనల క్రమంలో కొందరు రైతులు మృతి చెందిన నేపథ్యంలో..ఈసారి అన్నదాతలు, సంఘాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు కేంద్రం సైతం.. గతానుభవాలతో జాగ్రత్త పడుతోంది. రైతులు ఆందోళనల విషయంలో ఎంత పట్టుదలతో ఉన్నారో తెలిసిన కేంద్రం.. వారిని ఎలాగైనా చల్లబరచాలని ప్రయత్నిస్తోంది. అదీ సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో.. ఈవ్యవహారాన్ని అత్యంత జాగ్రత్తగా చక్కబెట్టాలని ప్రయత్నిస్తోంది. ఏమాత్రం తేడా వచ్చినా, రైతు వ్యతిరేకిగా ముద్రపడే ప్రమాదముండడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది కేంద్రం.

పంటలకు కనీస మద్దతు ధర, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలు, గతంలో రైతులు చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన కర్షకుల కుటుంబాలకు సాయం అందించడం సహా పలు డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ గత వారం రైతు సంఘాలు ఢిల్లీ చలోకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీగా బయలుదేరిన రైతులను శంభు సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీవైపు వెళ్లకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, కాంక్రీట్‌ దిమ్మెలను ఏర్పాటు చేశారు. దీంతో కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించాలని, లేదంటే శాంతియుతంగా ఢిల్లీ వరకూ ర్యాలీ చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ రైతులు 6 రోజులుగా సరిహద్దుల్లోనే ఉండిపోయారు. మరోవైపు ఈ నెల 23వ తేదీన దిల్లీకి మార్చ్‌ నిర్వహిస్తామని నొయిడా, గ్రేటర్‌ నొయిడా రైతులు తెలిపారు. భూసేకరణకు అధిక పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్ల అప్పగింతపై ఈ మార్చ్‌ నిర్వహించనున్నామని వెల్లడించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :