ASBL Koncept Ambience
facebook whatsapp X

క్యాంప్ పాలిటిక్స్ టెన్షన్..?

క్యాంప్ పాలిటిక్స్ టెన్షన్..?

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ దృష్ట్యా రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. ఓవైపు ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్ఠానం రాష్ట్ర నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. కౌంటింగ్‌కు ముందు అభ్యర్థులు ఎవరూ చేజారకూడదని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండేందుకు అధిష్ఠానం చర్యలకు ఉపక్రమించింది. పార్టీ అభ్యర్థులందరినీ హైదరాబాద్‌ రప్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సునాయాసంగా అధికారం ఖాయమని భావిస్తున్నప్పటికీ, బీఆర్ఎస్ ఎక్కడ తమ అభ్యర్థులను లాగేస్తుందో అన్న భయం హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని కర్నాటక డిప్యూటీసీఎం డికె శివకుమార్ వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఆయన స్వయంగా సంప్రదించినట్లు మా పార్టీ అభ్యర్థులు చెప్పారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం రాదన్నారు డికె.

అయితే.. కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి మెజారిటీ వచ్చిన పక్షంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ.. మెజార్టీ తగ్గితే మాత్రం ఇక్కట్లు తప్పవు. ఎందుకంటే..  ఇప్పటికే కాంగ్రెస్ లో చాలా వర్గాలున్నాయి. రేవంత్ ను సీఎంగా ఓవర్గం ప్రచారం చేస్తోంది. రేవంత్ కాక భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి.. ఇలా చాలా మంది సీఎం కుర్చీకోసం కాచుకుని కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితిలో మెజార్టీ తగ్గితే, ఏవర్గానికి చెందిన ఎమ్మెల్యేలను అయినా బీఆర్ఎస్ లాక్కునే ప్రమాదముందన్నది కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతల ఆలోచనగా ఉంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా క్యాంపులు నిర్వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనున్న 49 కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక పరిశీలకులను ఏఐసీసీ నియమించింది. ఎన్నికల ఏజెంట్‌కు ఎమ్మెల్యే ధ్రువపత్రం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ను కలిసి కోరారు. అయితే అలాంటి వెసులుబాటు ఏదీ లేదని వికాస్‌ రాజ్‌ వారికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :