యూఎస్ లో తెలుగు విద్యార్థిపై దాడి… వీడియో వైరల్
అమెరికాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ కి చెందిన సయ్యద్ మజాహిర్ అలీ అనే విద్యార్థి చికాగోలోని క్యాంప్ బెల్ ఏవ్ లోని తన ఇంటి దగ్గర ముసుగు దొంగలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు! ఇది దోపిడీకోసం జరిగిన దాడిగా చెబుతున్నారు! ఈ దాడికి సంబంధించిన వీడియోలు, దాడి అనంతరం అలీ మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అలీని అతని ఇంటి సమీపంలో దొంగలు వెంబడించడం కనిపిస్తుంది. మరో వీడియోలో.. తల, ముఖం గాయాలతో రక్తస్రావం అవుతున్న అలీ తనపై గుర్తు తెలియని దొంగలు ఎలా దాడి చేశారో వివరించాడు.
అయితే... ఈ దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన అలీని వెంటనే ఆసుపత్రికి తరలించారు.. అతను ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. దుండగుల దాడిలో గాయపడిన తన భర్తకు సాయం చేయాలని హైదరాబాద్ విద్యార్థి సయ్యద్ అలీ భార్య కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు. అటు చికాగోలోని భారత కాన్సులేట్ కూడా ఘటనపై స్పందించింది. బాధిత విద్యార్థి మజాహిర్ అలీ, ఆయన భార్యతో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. వారికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న స్థానిక అధికారుల నుంచి వివరాలు సేకరించినట్లు పేర్కొంది. హైదరాబాద్ నగరంలోని లంగర్హౌజ్ హషీమ్నగర్కు చెందిన మజాహిర్ అలీ కొద్ది నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. ఇండియానా వెస్లయన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదువుతున్నారు.