జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్తత.. గృహనిర్బంధంలో నేతలు..
ఎన్నికల సందర్భంగా తలెత్తిన కొన్ని ఘర్షణలు పలు ప్రాంతాలలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తప్పు ఎవరిదో స్పష్టంగా తెలియనప్పటికీ జరుగుతున్న నష్టం మాత్రం కంటి ముందు బాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన జమ్మలమడుగులో కూడా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులను అదుపులో తీసుకురావడానికి సుమారు 500 మంది పోలీసులు అక్కడ మోహరించారు. అంతేకాకుండా ప్రధాన పార్టీల అభ్యర్థులను గృహనిర్బంధంలో ఉంచారు. నిడిజువ్వి వైసీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డి, దేవగుడి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప టీడీపీ అభ్యర్థి భూపేశ్‌రెడ్డి ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్నారు. మరోవైపు పల్నాడు జిల్లాకు చెందిన మాచర్లలో కూడా పోలీసులు అడుగడుగునా మోహరించి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు. మొత్తానికి ఎన్నికలు ముగిసిన తరువాత ఆంధ్రాలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న దాడులు, గొడవలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి.