కసిగా ఓట్లు వేసిన ఓటర్లు.. ఆంధ్రాలో భారీగా నమోదైన ఓటింగ్ శాతం..
ఆంధ్రాలో నిన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా భారీగా పోలింగ్ నమోదు అయ్యింది. కేవలం దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఏపీకి తరలివచ్చి ఓటర్లు తమ ఓటు నమోదు చేయడం విశేషం. ఏపీలో సుమారు 7 గంటల ప్రాంతం నుంచి మొదలైన ఓటింగ్ గంట గంటకు పెరుగుతూనే వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంట్ సీట్లకు గాను జరిగిన పోలింగ్ ఉదయం 9 గంటలకు సుమారు 9.21 శాతం నమోదు అయింది. 11 గంటల ప్రాంతంలో ఓటింగ్ 23.04 చేరుకున్న ఓటింగ్ శాతం 3 గంటల సమయానికి 55.49 శాతం కు చేరుకుంది. సాయంత్రం 5 గంటల సమయంలో 67.99 శాతంగా పోలింగ్ నమోదు అయింది. రాత్రి వరకు కూడా పోలింగ్ భారీ సంఖ్యలోనే కొనసాగింది. ఈసారి కని విని ఎరగని రీతిలో స్పందించిన ఓటర్లు చాలా కసిగా పోలింగ్ సెంటర్లకు వచ్చి ఓట్లు వేశారు. ఏ పార్టీ కా పార్టీ ప్రజలు తమ వైపే ఉన్నారని.. భారీగా తమకే ఓట్లు నమోదు అయ్యాయని సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టుకుంటున్నాయి. కానీ నిజం ఓట్ల లెక్కింపు తర్వాతే బయటకు వస్తుంది.