Radha Spaces ASBL

కాంగ్రెస్ మాట తప్పింది.. ప్రజలే గుణపాఠం చెప్పాలి : హరీష్ రావు

కాంగ్రెస్ మాట తప్పింది.. ప్రజలే గుణపాఠం చెప్పాలి : హరీష్ రావు

మాట తప్పిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని నిజాంపేట మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజలు పూర్తయినా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, కొత్త హామీలు అమలు చేయకపోగా.. ఉన్న పథకాలు కూడా అటకెక్కించారని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో కరువు వచ్చిందని, కరెంట్ మోటార్లు కాలిపోతున్నాయని, వ్యవసాయాన్ని ఆగం చేశారని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ అందులో ఒక్కటి కూడా ఇంకా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు.. ఆ పార్టీకి రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని మండిపడ్డారు. "మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీలను చట్టబద్ధత చేస్తామన్నారని.. 3 అసెంబ్లీలు అయినా దిక్కులేదు. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ ఇవ్వలేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. 100 రోజుల్లో హామీలను అమలుచేస్తామని మాట తప్పిన కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేసి మోసపోవద్దు. కారుకి ఓటేసి వాళ్లకు గుణపాఠం నేర్పండి" అంటూ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.

అంతే కాకుండా ఉన్న జిల్లాలను తీసివేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా నిప్పులు చెరిగారు. ఉన్న జిల్లాలను తీసివేస్తే చూస్తూ ఊరికే ఉండేది లేదన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, ఈ ఎన్నికల్లో కారు పార్టీకి ఓటు వేసి ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :