వేలాది మంది రైతులతో మల్లన్న సాగర్‌ను ముట్టడిస్తాం: హరీశ్‌రావు
నీళ్లు, విద్యుత్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ప్రభుత్వ అలసత్వం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం సిద్దిపేట కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన హరీశ్‌రావు.. రైతులను ఆదుకోవాలని, ధాన్యానికి రూ.500 బోనస్, రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పొలంబాట పట్టిన తర్వాతే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిందన్నారు. సోమవారం కేసీఆర్ వస్తున్నారని తెలియగానే గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేశారన్న హారీశ్‌రావు.. కేసీఆర్ వెళ్లడంతోనే సాగర్ ఎడమ కాలువకు నీళ్లు వదిలారని, ఇప్పుడు కరీంనగర్ వస్తున్నారని తెలియగానే ఎస్సారెస్పీ కాలువకు నీళ్లిచ్చారని విమర్శలు గుప్పించారు. ఇది వచ్చిన కరువు కాదని, ప్రభుత్వం అసమర్థతతో తెచ్చిన కరువని నిప్పులు చెరిగారు.
దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు ప్రభుత్వం ప్రవర్తిస్తోందన్న హరీశ్‌రావు.. నీళ్లున్నా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అలాగే మల్లన్నసాగర్‌లో నీళ్లున్నా ఎందుకు విడుదల చేయడంలేదని నిలదీశారు. కూడవెల్లి వాగు పరిధిలో 10 వేల ఎకరాలు ఎండిపోయినా స్పందించేనాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా కూడవెళ్లి వాగుకు నీళ్లు విడుదల చేయకపోతే వేలాది మంది రైతులతో మల్లన్న సాగర్‌ను ముట్టడిస్తామని, అవసరమైతే తామే మల్లన్నసాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ.. తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకు నెరవేర్చలేదని విమర్శించారు. అవసరమైతే ఈ విషయంపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిచాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేలు నష్టపరిహారం అందించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.