Radha Spaces ASBL

కృష్ణ లాం ఆధ్వర్యంలో... ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్‌ సంక్రాంతి సంబరాలు

కృష్ణ లాం ఆధ్వర్యంలో... ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్‌ సంక్రాంతి సంబరాలు

వాషింగ్టన్‌ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్‌ సంక్రాంతి సంబరాలు, ఘంటసాల శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సినీనటి జమున, కళాతపస్వి కె.విశ్వనాథ్‌, నేపథ్య గాయని వాణి జయరాం మృతిపట్ల సంతాపం తెలియజేశారు. వారి మృతి తెలుగుజాతికి, సినీపరిశ్రమకు తీరని లోటన్నారు. ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షులు కృష్ణ లాం మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ,  తెలుగు సంగీత సామ్రాజ్యానికి రారాజు ఘంటసాల అంటూ, ఆయన ఆలపించిన భగవద్గీత నభూతో నభవిష్యత్‌  అన్నారు. అలాంటి మహనీయుని శతజయంతి ఉత్సవాలు జరుపుకునే అవకాశం రావడం మన అదృష్టం. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో జీడబ్ల్యూటీసీఎస్‌ ఆధ్వర్యంలో అనేక సేవా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహించుకున్నాం. అలాగే ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడ అందరం కలుసుకుని జీడబ్ల్యూటీసీఎస్‌ వేదికపై ఈ పండుగను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్రముఖ సినిమా దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాలను మేం మర్చిపోతున్నా మీరు కొనసాగిస్తుండటం అభినందనీయం. ఘంటసాల శతజయంతి ఉత్సవాలు లాంటివి సినిమా వాళ్లుగా మేం చేయలేనందుకు సిగ్గుపడుతున్నాం. ఒక జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషేనని గుర్తుంచుకోవాలి. జీడబ్ల్యూటీసీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలు ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపాయి. ఇంత బాగా నిర్వహించిన సంస్థ అధ్యక్షులు కృష్ణ లాంను అభినందించారు.

భారత రాయబార కార్యాలయ ఉన్నతాధికారి రవి కోట మాట్లాడుతూ.. సంక్రాంతి అంటే తెలుగు సంస్కృతిని, పల్లె క్రాంతిని దర్శించుకోవడం. మన తెలుగువారి పండుగైన సంక్రాంతి ప్రజలకు ఎన్నో అనుభూతులు మిగులుస్తుంది.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ఏ జాతైతే తన మాతృభాషను, సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోతుందో ఆ జాతి అంతరించిపోతుంది. భాష నాగరికతను నేర్పిస్తుంది. ముఖ్యంగా భాషే ఒక సాంస్కృతిక వారథి అన్నారు.

డాక్టర్‌ ముల్పూరి వెంకట్రావు మాట్లాడుతూ.. సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండుగ. ఈ పర్యదిన విశిష్టతను భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. తానా బోర్డు మాజీ అధ్యక్షులు నరేన్‌ కొడాలి, అనిల్‌ ఉప్పలపాటి తదితరులు ప్రసగించారు. తానా పూర్వాధ్యక్షులు సతీష్‌ వేమన ఫోన్‌ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

పండుగ వాతావరణం సంతరించకునేలా సంక్రాంతి శోభ ఉట్టిపడుతూ చేసిన అలంకరణ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రంగవల్లులు, ముగ్గుల పోటీలు, పెళ్లిభోజనాలను తలపించేలా తాంబూలంతో కూడిన సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సంస్థ పూర్వాధ్యక్షులు సత్యనారాయణ మన్నె, రవి గవిరినేని, సాయిసుధ పాలడుగు, కిషోర్‌ తంగేటి, జీడబ్ల్యూటీసీఎస్‌ కార్యవర్గ సభ్యులు సుశాంత్‌ మన్నె, విజయ్‌ అట్లూరి, సుష్మ అమృతలూరి, కార్తీక్‌ కోమటి, రవి అడుసుమిల్లి, శ్రీవిద్య సోమ, భాను మాగులూరి, యాష్‌ బొద్దులూరి, చంద్ర మలావతు, రాజేష్‌ కాసరనేని, ఉమాకాంత్‌ రఘుపతి, ఫణి తాళ్లూరి, శ్రీనివాస్‌ గంగ, ప్రవీణ్‌ కొండక, పాల్గొన్న ఇతర ప్రముఖులు రమాకాంత్‌ కోయ, రామ్‌ చౌదరి ఉప్పుటూరి, విజయ్‌ గుడిసేవ, సాయి బొల్లినేని తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :