ASBL NSL Infratech

నా మాటలను త‌ప్పుగా అర్థం చేసుకున్నారు - చిరంజీవి

నా మాటలను త‌ప్పుగా అర్థం చేసుకున్నారు - చిరంజీవి

త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల పేద ప్ర‌జ‌ల‌కు, ఫ్యాన్స్‌, సినీ కార్మికుల‌కు కూడా ఉచిత క్యాన్స‌ర్ స్క్రీనింగ్ క్యాంప్స్ - స్టార్‌ క్యాన్స‌ర్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి

త‌న‌ ఉన్న‌తికి కార‌ణ‌మైన సినీ ఇండ‌స్ట్రీకి, అభిమానుల‌కు, స‌మాజానికి ఏదో ఒక‌టి చేయాల‌ని ఎప్పుడూ త‌పించే వ్య‌క్తి మెగాస్టార్ చిరంజీవి. 

చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా బ్ల‌డ్ అండ్ ఐ బ్యాంక్ ప్రారంభించి 10 ల‌క్ష‌ల యూనిట్స్ సేక‌రించి పేద‌ల‌కు, అవ‌స‌రార్థంలో ఉన్న పేద వారికి ర‌క్తాన్ని అందజేశారు. అలాగే, ఐ బ్యాంక్ ద్వారా 70 వేల మందికి corneal transplants చేయించడం ద్వారా తిరిగి కనుచూపు వచ్చేలా చేశారు. 

క‌రోనా స‌మ‌యంలో సినీ కార్మికుల‌కు కోటి రూపాయ‌ల విరాళం ప్ర‌క‌టించ‌ట‌మే కాకుండా సీసీసీని స్థాపించి ఇండ‌స్ట్రీ స‌హా ఇత‌రుల నుంచి విరాళాల‌ను సేక‌రించి కార్మికుల కుటుంబాల‌ను ఆదుకుని త‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు. అలాగే ఓ డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి వెళ్లిన‌ప్పుడు సినీ కార్మికులు, మీడియా ప్రతినిథులు స‌ద‌రు సెంట‌ర్‌లో పరీక్షలు చేయించుకున్నప్పుడు 50 శాతం రాయితీని పొందేలా చేశారు. అలాగే ఇప్పుడు మ‌రోసారి సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద కొడుకుగా భుజం కాయ‌టానికి తానెప్పుడూ సిద్ధ‌మేన‌ని నిరూపించారు. శ‌నివారం ఓ క్యాన్స‌ర్ స్క్రీనింగ్ స్కాన్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరంజీవి త‌న అభిమానుల‌కు, సినీ కార్మికుల‌కు క్యాన్స‌ర్ సంబంధిత స్క్రీనింగ్ క్యాంప్స్‌ను ఏర్పాటు చేయాల‌ని అందుకు అయ్యే ఖ‌ర్చంతా ఏదైనా తాను భ‌రిస్తాన‌ని, అందుకు క్యాన్స‌ర్ సెంట‌ర్‌ వారు కూడా అందుకు అండ‌గా నిల‌బ‌డాల‌ని రిక్వెస్ట్ చేశారు.  క్యాన్స‌ర్ వ‌ల్ల ఎంద‌రో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని , అయితే అవ‌గాహ‌న ఏర్పరుచుకుని ఎప్ప‌టిక‌ప్పుడు స‌రైన చికిత్స‌లు చేయించుకోవ‌టం ద్వారా ప్రాథ‌మిక ద‌శ‌లోనే దాన్ని గుర్తించి నిరోధించ‌వ‌చ్చున‌ని చిరంజీవి తెలిపారు.

హైద‌రాబాద్‌లో జ‌రిగిన స్టార్ క్యాన్స‌ర్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో స్టార్ హాస్పిట‌ల్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డా.గోపీచంద్ మ‌న్నం త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ...‘‘డాక్టర్స్ ఇచ్చే హ్యుమ‌న్ ట‌చ్ చాలా గొప్ప‌గా ఉంటుంది. ఈ రోజు స్టార్ క్యాన్స‌ర్‌ సెంట‌ర్ నా చేతుల మీదుగా ప్రాంభించ‌బ‌డ‌టం ఎంతో ఆనందంగా ఉంది. సాధార‌ణంగా మ‌నం అంద‌రం అనారోగ్యానికి గుర‌వుతున్నాం. మ‌రీ ముఖ్యంగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారితో సామాన్యులు పోరాడుతున్నారు. గ‌త ఏడాది 19 ల‌క్ష‌లు మంది క్యాన‌ర్స్ బారిన ప‌డ్డారంటే ప‌రిస్థితి ఎంత భ‌యంక‌రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకు కార‌ణం మ‌న ఆహార‌పు అల‌వాట్లు.. ప‌రిస‌రాలు ఇలా ఏవైనా కావ‌చ్చు. అలాగే ప్ర‌జ‌ల్లోనూ క్యాన్స‌ర్ ప‌ట్ల ఎలాంటి అవ‌గాహ‌న లేక పోవ‌టం వ‌ల్ల ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు.

క్యాన్స‌ర్‌ను ప్రాథ‌మిక స్టేజ్‌లో గుర్తిస్తే దాన్ని మ‌నం నివారించుకోవ‌చ్చు. నేను ఆరోగ్యంగా ఉంటాను. చ‌క్క‌టి ఆహారం తీసుకుంటాను అనే భావ‌న‌లో ఉంటాను. అలాంటి నేను కూడా ఈ మ‌ధ్య కాలంలో ఏఐజీ హాస్పిట‌ల్‌లో కొలొనో స్కోప్ టెస్ట్‌ తీసుకున్నాను. అందులో నాన్ క్యాన్స‌ర్ పాలిప్స్‌ను గుర్తించారు. కొన్ని సందర్భాల్లో వాటిని అలాగే వ‌దిలేస్తే అది క్యాన్స‌ర్‌గా కూడా ప‌రిణ‌మించ‌వ‌చ్చున‌ని భావించి డాక్ట‌ర్స్ వాటిని తీసేశారు. ప్రాథ‌మికంగా గుర్తించ‌టం వ‌ల్ల ఎలాంటి ఇబ్బంది రాలేదు. అవ‌గాహన అనేది లేక‌పోయుంటే ఇబ్బందిగా మారేదేమో. మ‌న చేతుల్లో ఉండి జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే చాలా ఇబ్బందులు వ‌స్తాయి. ఇలాంటి విష‌యాల‌పై అవ‌గాహ‌న ఎంతో అవ‌స‌రం. ముందుగా ఆరోగ్య‌ప‌ర‌మైన మెడిక‌ల్ స్క్రీనింగ్ / స్కాన్ చేయించుకోవ‌టం ద్వారా క్యాన్స‌ర్ వంటి మ‌హ‌మ్మారిని నిరోధించ‌వ‌చ్చు.

ఈ సంద‌ర్భంగా గోపీచంద్‌గారికి ఓ రిక్వెస్ట్‌.. క్యాన్స‌ర్‌కి సంబంధించిన టెస్టులు చేయించుకుంటుంటారు. చాలా మందికి అవ‌గాహ‌న ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డికి వెళ్లాల‌నేది, ఏ ట్రీట్‌మెంట్ చేయించుకోవాల‌నేది తెలియ‌దు. సందిగ్ధంలో ఉంటారు. ముఖ్యంగా నా అభిమానుల‌కు గిఫ్ట్‌గా, భ‌రోసాగా మా చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్‌తో క‌లిసి మీరు అభిమానుల‌కు ఏదైనా చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుకుంటున్నాను. అలాగే సినీ కార్మికుల్లో చాలా మంది పేద‌వాళ్లు ఉన్నారు. వారు కొండ‌న‌క‌, కోన‌న‌క‌, దుమ్ము, దూళిలో ప‌ని చేస్తున్న‌ప్పుడు ఎవ‌రికీ ఏ ర‌క‌మైన స‌మ‌స్య వస్తుందో తెలియ‌దు. ఊపిరితిత్తుల స‌మ‌స్య రావ‌చ్చు. ఇంకేదైనా రావ‌చ్చు. అలాంటి పేద‌వారికి ఏమైనా చేయ‌గ‌ల‌మా!, ముంద‌స్తుగా ఏమైనా క‌నిపెట్ట‌గ‌ల‌మా! స్క్రీనింగ్ టెస్టులులాంటివి ఏమైనా ఆయా జిల్లాలో చేస్తే.. ఆ ఖ‌ర్చు నేను భ‌రిస్తాను. మ‌నం అంద‌రం ప‌ర‌స్ప‌రం భ‌రించుకుందాం. దేవుడు నాకు కోట్లు ఇచ్చాడు. ఎన్ని కోట్లు అయినా నేను భ‌రించ‌గ‌ల‌ను. అవ‌కాశాలేమైనా ఉంటే ప‌రిశీలించండి’’ అన్నారు.

డా.గోపీచంద్ మ‌న్నం త‌ప్ప‌కుండా చిరంజీవి అభిమానుల‌కు, సినీ కార్మికుల కోసం క్యాన్స‌ర్‌ స్క్రీనింగ్ క్యాంప్స్‌ను ప్రారంభిస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే ఈ మీటింగ్ చిరంజీవి మాట్లాడిన విష‌యాల‌పై కొన్ని మీడియా సంస్థ‌లు ..ఆయ‌న కాన్స‌ర్ బారిన ప‌డ్డారంటూ వార్త‌లు రాశాయి. దానిపై చిరంజీవి ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు.

https://twitter.com/KChiruTweets/status/1664988508883406848

‘‘కొద్ది సేపటి క్రితం  నేనొక క్యాన్సర్ సెంటర్ ని  ప్రారంభించిన  సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా ఉండి కొలోన్ స్కోప్  టెస్ట్  చేయించుకున్నాను. అందులో నాన్ కాన్స‌రెస్ పాలిప్స్ ( non - cancerous polyps)ని డిటెక్ట్ చేసి  తీసేశారు అని చెప్పాను. 'అలా ముందుగా టెస్ట్  చేయించుకోకపోయి ఉంటే అది క్యాన్సర్ కింద మారేదేమో' అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి' అని  మాత్రమే  అన్నాను.
 
అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో 'నేను క్యాన్సర్ బారిన పడ్డాను' అని, 'చికిత్స వల్ల బతికాను' అని స్క్రోలింగ్ లు, వెబ్  ఆర్టికల్స్ మొదలు  పెట్టాయి. దీని వల్ల అనవసరమైన  కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ  క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల  అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :