ASBL NSL Infratech

రఫాలో ఇజ్రాయెల్ రాక్షసక్రీడ..

రఫాలో ఇజ్రాయెల్ రాక్షసక్రీడ..

రఫా రక్తమోడుతోంది. తల్ అల్ సుల్తాన్ ప్రాంతం సురక్షితమన్న ఇజ్రాయెల్ మాటలు నమ్మి ఆప్రాంతంలో గుడారాలు వేసుకున్న అమాయకులు.. ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ బాంబింగ్ లో 45 మందికి పైగా ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.అసలు ఆప్రాంతం చూస్తే .. చాలు హృదయం చలించిపోతుంది. మండుతున్న గుడారాలు, కాళ్లు, చేతులు విరిగి చెల్లాచెదురుగా పడిన శరీరాలు, రక్షించాలని హాహాకారాలు.. వీటిని చూస్తే అర్థమవుతోంది ఇజ్రాయెల్ యుద్ధం ఏరీతిన సాగుతోందో. ఇజ్రాయెల్ ఏమంటోందంటే....అక్కడ హమాస్ ఉగ్రవాదులు వచ్చి చేరారని తమకు తెలిసిందని.. అందుకే దాడులు చేశామంటోంది.

అయితే ప్రజాసమూహంలో ఉగ్రవాదులు ఉంటే.. ఏదేశసైన్యమైనా నేరుగా బాంబింగ్ చేస్తుందా... అంత సాహసానికి, క్రౌర్యానికి ఒడిగట్టగలదా.. ? కానీ.. ఇజ్రాయెల్ మాత్రం నేరుగా బాంబింగ్స్ చేస్తోంది. అంటే పాలస్తీనావాసుల ప్రాణాలను గడ్డిపరకల్లా భావిస్తోందా...? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోనీ ఈ యుద్ధమైనా వేగంగా ముగుస్తుందా అంటే ఆ పరిస్థితి కనుచూపు మేరల్లో కనిపించడం లేదు. వీళ్లు ఎక్కడ నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తే.. అక్కడ హమాస్ బలపడుతోంది. లేటెస్టుగా టెల్ అవీవ్ పైకి హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులు చేశారంటే.. అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే హమాస్ ఉగ్రవాదులు... పాలస్తీనావాసుల్లో కలిసి ఉంటున్నారు కాబట్టి వారందరినీ అంతం చేయాల్సిన పరిస్థితులను ఇజ్రాయెల్ సృష్టిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇజ్రాయెల్ ఎందుకు ఆగడం లేదు..

రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలిచ్చినా, అమెరికా సహా ప్రపంచమంతా మొత్తుకుంటున్నా.. ఇజ్రాయెల్‌ ఖాతరు చేయడం లేదు. దాడిని ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్‌ సహా స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్, తుర్కీయేలు తీవ్రస్వరంతో ఖండించాయి. ‘‘ఈ ఆపరేషన్లను ఆపాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. తక్షణం కాల్పుల విరమణ పాటించాలి’’ అని ‘ఎక్స్‌’ వేదికగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ పేర్కొన్నారు.

తప్పు జరిగింది.. కానీ ఆపరేషన్ ఆపమన్న నెతన్యాహు

రఫాపై దాడి విషయంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. తప్పు చేశామని పార్లమెంటులో అంగీకరించారు. ‘‘సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతిమ విజయం సాధించేవరకు యుద్ధం ఆపబోమని తెలిపారు. మరోవైపు హమాస్‌ కమాండర్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడి చేశామని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది.

గాజా, ఈజిప్టు సరిహద్దుల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రఫా క్రాసింగ్‌ దగ్గర ఈజిప్టు, ఇజ్రాయెల్‌ సైన్యం మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఈజిప్టు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది. మరోవైపు..పాలస్తీనావాసులకు సంఘీభావంగా తాము ఐదు నౌకలపై దాడులు చేసినట్లు హూతీ మిలిటెంట్లు ప్రకటించారు. హిందూ మహాసముద్రం, ఎర్ర సముద్రంలో మూడు సరకు రవాణా నౌకలు, ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన రెండు యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. రఫాలో ఆదివారం ఇజ్రాయెల్‌ జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి తీవ్ర స్థాయిలో ఖండించింది. ఇప్పటికైనా దీన్ని ఆపేయాలనికోరింది. బందీలను విడుదల చేయాలని హమాస్‌కు సూచించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :