ASBL NSL Infratech

పెన్షన్ల చుట్టూ ఏపీ రాజకీయం..!

పెన్షన్ల చుట్టూ ఏపీ రాజకీయం..!

ఆంధ్రప్రదేశ్ ప్రతిదీ రాజకీయమే. ఏ చిన్న అంశాన్నయినా తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలన్నీ కాచుకు కూర్చున్నాయి. ఇప్పుడు ఏపీలో రాజకీయమంతా పెన్షన్ల చుట్టూ నడుస్తోంది. ఇన్నాళ్లూ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు లబ్దిదారులకు అందేవి. అయితే ఎన్నికల కమిషన్ వాలంటీర్లకు బ్రేక్ వేయడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ వల్లే పెన్షన్లు ఆగిపోయాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా.. నిధులు లేకపోవడం వల్లే పింఛన్లు పంపిణీ చేయకుండా వైసీపీ నేతలు నెపాన్ని తమపైకి నెట్టేస్తున్నారని కూటమి లీడర్లు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు అందినా అందకపోయినా వయోవృద్ధులకు పింఛన్లు మాత్రం ఠంచనుగా అందుతున్నాయి. పింఛన్ల పంపిణీని వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఇందుకు కారణం. సచివాలయాల పరిధిలో ప్రతి 50 ఇళ్లుక ఒక వాలంటీర్ ను నియమించి వాళ్ల ద్వారా తమ పరిధిలోని వారందిరకీ పింఛన్లు పంపిణీ చేస్తూ వస్తోంది. తాము అధికారంలోకి వచ్చేందుకు అవ్వాతాతలు ఓట్లు ఎంతో కీలకమని భావిస్తున్న వైసీపీ.. పింఛన్ల పంపిణీని గొప్పగా చెప్పుకుంటోంది. ఈ క్రెడిట్ అంతా వాలంటీర్లదేనని ప్రకటించింది.

అయితే రాష్ట్రవ్యాప్తంగా పలువురు వాలంటీర్లు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారని.. వాళ్ల ద్వారా ప్రజల డేటా వైసీపీ నేతలకు అందుతోందని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. అంతేకాక సిటిజన్స్ ఫర్ డెమొక్రటిక్ ఫోరం అనే సంస్థ కోడ్ ముగిసే వరకూ వాలంటీర్లను తప్పించాలని ఈసీకి సూచించింది. వీటన్నిటినీ పరిశీలించిన అనంతరం వాలంటీర్లను విధుల నుంచి తప్పిస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది. వాళ్ల దగ్గరున్న మొబైల్ ఫోన్లను, ఇతరత్రా ప్రభుత్వ సామాగ్రిని స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించింది. దీంతో వాలంటీర్లు ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములు కాకుండా సైడ్ అయిపోవాల్సి వచ్చింది.

వాలంటీర్లను ఈసీ తప్పించడం వల్లే ఇప్పుడు పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడిందని.. టీడీపీ, జనసేన వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిస్తోంది. అయితే వాలంటీర్లను సొంత ప్రయోజనాలకు వాడుకోవడం వల్లే ఈసీ వాళ్లపై వేటు వేసిందని టీడీపీ, జనసేన నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాక.. ఎన్నికల ముంగిట నిధులను పక్కదారి మళ్లించడం వల్ల ఖజానా ఖాళీ అయిందని.. అందుకే పింఛన్లు ఇవ్వలేక జగన్ సర్కార్ చేతులెత్తేసిందని కూటమి నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. మొత్తానికి పింఛన్ల పంపిణీ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :