Radha Spaces ASBL

విలువలతో కూడిన రాజకీయ దురంధరుడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ అభిభాషణ

విలువలతో కూడిన రాజకీయ దురంధరుడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ అభిభాషణ

తిరుపతి: 75 వసంతాల భారతావనిలో నైతిక ప్రమాణాలు క్షీణిస్తున్న తరుణంలో, విలువలు మృగ్యమవుతూ అవినీతి రాజ్యమేలుతున్న ఆధునిక యుగంలో డాక్టర్ నీలం సంజీవరెడ్డి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రిగా, లోక్ సభ స్పీకరుగా, కేంద్ర మంత్రిగా, ఆరవ భారత రాష్ట్రపతిగా ఆయన పాటించిన నైతిక ప్రమాణాలను, సాధించిన అభివృద్ధిని, ప్రదర్శించిన నిరాడంబరతను గుర్తు చేసుకోవడం నేటి తరానికి అవసరం ఎంతైనా ఉందని, ఆంధ్రప్రదేశ్ పూర్వ ఉపసభాపతి మరియు పూర్వ మంత్రివర్యులు డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. 

భారత గ్రామీణ అధ్యయనం మరియు పరిశోధన అకాడమీ (అగ్రశ్రీ), తిరుపతి వారు నెలకొల్పిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థను డాక్టర్ సంజీవరెడ్డి ఆచరించారని, నాయకత్వం అంటే ప్రవర్తన, ఆదర్శాలు, లక్ష్యాలకు ప్రతిరూపమైన నాయకుడిగా దూరదృష్టి, ఆత్మస్థైర్యం, త్యాగనిరతి, అవసరమైనప్పుడు సర్దుబాటుతత్వం, చమత్కార ప్రవృత్తి లాంటి లక్షణాలతో బాసిల్లాలని కలలుగన్నారని వివరించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధమ ముఖ్యమంత్రిగా డాక్టర్ సంజీవరెడ్డి ఆనాడు దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించబట్టి ఆంధ్రప్రదేశ్ మన దేశానికి ధాన్యాగారంగా సస్యశ్యామలమై నిలిచిందని డాక్టర్ బుద్ధ ప్రసాద్ స్పష్టం చేశారు. 

నాగార్జునసాగర్, కృష్ణా బ్యారేజీ, శ్రీశైలం, వంశధార, పోచంపాడు ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ స్కీములు, వరద నిరోధక పథకాలు చేపట్టి వాటిలో చాలా భాగాన్ని పూర్తిచేయబట్టి డాక్టర్ నీలం సంజీవరెడ్డిని అందరూ ఆ రోజుల్లో ఆంధ్ర భగీరథ అని కీర్తించారని డాక్టర్ బుద్ధ ప్రసాద్ వక్కాణించారు. 

ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో భారీ పరిశ్రమలు రావడానికి విద్య, వైద్య, రవాణా, విద్యుత్ రంగాలు అభివృద్ధికి డాక్టర్ నీలం సంజీవరెడ్డి ప్రధాన కారకుడు, ప్రేరకుడు అని, అలాగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, వివిధ అకాడమీల స్థాపన డాక్టర్ నీలం సంజీవరెడ్డి కృషి ఫలితమేనని, ఏ రంగాన్ని విస్మరించకుండా సర్వాంగీన అభివృద్ధికి ఆయన పాటుపడ్డారని డాక్టర్ బుద్ధ ప్రసాద్ ఉదహరించారు. 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో డాక్టర్ నీలం సంజీవరెడ్డి కీలక భూమిక వహించారని, రాజస్థాన్ తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన రెండో రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని, పంచాయతీలు, పంచాయతీ సమితిలు, జిల్లా పరిషత్తులు అనే మూడు అంచల వ్యవస్థని ఏర్పాటు చేయడానికి బలీయమైన పునాదులు వేశారని డాక్టర్ బుద్ధ ప్రసాద్ వివరించారు.

పంచాయతీరాజ్ వ్యవస్థ వలన గ్రామీణ ప్రాంతాల నుండి అంచలంచెలుగా నాయకత్వాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడిందని, కొత్త నాయకుల పనితనం, అభివృద్ధి కాముకులను గమనించి డాక్టర్ నీలం సంజీవరెడ్డి వారిని ప్రోత్సహించారని, అప్పట్లో జిల్లా పరిషత్ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ జలగం వెంగళరావు, శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి వారిని ప్రోత్సహించబట్టే తదనంతర కాలంలో వారు ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఎదిగారని డాక్టర్ బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. 

భారత రాష్ట్రపతిగా ఎన్నికైన డాక్టర్ నీలం సంజీవరెడ్డి రైతుబిడ్డగానే సంచరించి ప్రజల మనిషిగానే వ్యవహరించారని, రాజకీయ నాయకుడు ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తాడని, రాజనీతిజ్ఞుడు రేపటి తరం గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడని దృఢంగా నమ్మే డాక్టర్ నీలం సంజీవరెడ్డి, ఏ పదవిని చేపట్టిన రాజనీతిని ప్రదర్శించిన రాజనీతిజ్ఞుడిగా పేరు పేరు ప్రఖ్యాతలు సంపాదించారని డాక్టర్ బుద్ధ ప్రసాద్ కొనియాడారు. 

పాలకులు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే సమాజ వికాసం సాధ్యమవుతుందని నియమబద్ధంగా వ్యవహరించటం, ధర్మాన్ని పరిరక్షించటం, పాలకులు, పాలితులు, తమ కర్తవ్యం గా భావించాలని, ఈ సందర్భంగా డాక్టర్ నీలం సంజీవరెడ్డి జీవితం మనకు ఇచ్చే సందేశం అని డాక్టర్ బుద్ధ ప్రసాద్ వివరించారు. 

ఈ సందర్భంగా భారత గ్రామీణ అధ్యయనం మరియు పరిశోధనా అకాడమీ నెలకొల్పిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి విశిష్ట రత్న రాష్ట్ర పురస్కారాన్ని డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ కు బహుకరించారు. 

అలాగే డాక్టర్ నీలం సంజీవరెడ్డి న్యాయ శిరోమణి రాష్ట్ర పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ జి ఎతిరాజులుకు, విద్యా శిరోమణి రాష్ట్ర పురస్కారాన్ని అన్నమాచార్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ చొప్ప గంగిరెడ్డికి, వైద్య శిరోమణి రాష్ట్ర పురస్కారాన్ని స్విమ్స్ కార్డియాలజీ సీనియర్ ఆచార్యులు డాక్టర్ డి రాజశేఖర్ కు, పంచాయితీ రాజ్ శిరోమణి రాష్ట్ర పురస్కారాన్ని పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ అధికారి శ్రీ జీవీకే మల్లికార్జున రావులకు ముఖ్య అతిథి డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ బహుకరించారు. 

డాక్టర్ నీలం సంజీవరెడ్డి 110 జయంతి ఉత్సవాల సందర్భంగా అగ్రశ్రీ వెలువరించిన విశేష సంచికను గౌరవ అతిధి డాక్టర్ జస్టిస్ ఎతిరాజులు ఆవిష్కరించారు. 

సభకు అధ్యక్షత వహించిన వ్యవస్థాపక సంచాలకుడు అగ్రశ్రీ డాక్టర్ డి సుందరరామ్, డాక్టర్ నీలం సంజీవరెడ్డి స్మారకోపన్యాసం మరియు డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాష్ట్ర పురస్కారాల ఏర్పాటు లక్ష్యాలను వివరించారు. 

కార్యక్రమంలో అగ్రశ్రీ సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి డి భారతి సుందర్, సహాయ సంచాలకుడు డి సాయి కుమార్, ఆకాశవాణి విశ్రాంత సంచాలకుడు ఏ. మల్లేశ్వరరావు, వివిధ కళాశాలల అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :