అమెరికా విఫలదేశం: ట్రంప్..
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. కావాలని మాట్లాడుతున్నారో..? లేక యధాలాపంగా ఆవేశంతో అంటున్నారో తెలియదు కానీ.. వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగిస్తున్నారు. మొన్నటికి మొన్న నాటో సభ్యదేశాలు రక్షణ బడ్జెట్ పెంచుకోకుంటే.. వాటిపై దాడి చేయాలని తానే పుతిన్‌కు చెబుతానని వివాదాస్పదవ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఈసారి అమెరికా విఫలదేశమంటూ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోందన్నారు ట్రంప్. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లో మృతి చెందిన 72 గంటల తర్వాత తొలిసారి స్పందించిన ట్రంప్.. అమెరికాలో తానూ బాధితుడిగా మిగిలిపోయానన్నారు. నావల్నీ మృతికి, తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు ముడి పెడుతూ మాట్లాడారు. అమెరికాలో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. తన సామాజిక మాధ్యమంలో ట్రంప్ ఈ మేరకు పోస్టు చేశారు. అయితే ఈ పోస్టులో పుతిన్ పేరును ఆయన నేరుగా ఎక్కడా ప్రస్తావించలేదు. ఎత్తకపోవడం గమనార్హం.
‘‘అలెక్సీ నావల్నీ ఆకస్మిక మృతి ఘటనతో మన దేశంలో ఏం జరుగుతుందో నాకు అవగాహన కలిగింది. నిజాయితీ లేని, రాడికల్ లెఫ్ట్ రాజకీయ నాయకులు, ప్రాసిక్యూటర్లు, న్యాయమూర్తులు నెమ్మదిగా మనల్ని వినాశనం వైపు తీసుకెళ్తున్నారు. తెరిచిన సరిహద్దులు, ఎన్నికల రిగ్గింగ్, అన్యాయపూరితమైన కోర్టుల నిర్ణయాలు అమెరికాను నాశనం చేస్తున్నాయి. మనది క్షీణిస్తున్న దేశం. మనది విఫలమైన దేశం’’ అంటూ ట్రంప్ పోస్టులో పేర్కొన్నారు.
రెండో సారి అమెరికా పీఠం ఎక్కాలని ఆశపడుతున్న ట్రంప్ గత కొన్నేళ్ల నుంచి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. పలు కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు ఇటీవలే న్యూయార్క్ కోర్టు భారీ జరిమానా విధించింది. పలు బ్యాంకులను మోసం చేసి రుణాలు తీసుకున్న కేసులో 355 మిలియన్ డాలర్లు పెనాల్టీ చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ కేసుల నుంచి బయటపడాలని ట్రంప్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. లక్షల డాలర్లతో పేరుమోసిన లాయర్లను పెట్టుకుని.. కేసుల నుంచి బయటపడేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఆయన కేసుల పరిస్థితి ఓ అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కు అన్నట్లుగా తయారైంది. మరోవైపు.. ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దీంతో ట్రంప్ తన వ్యాఖ్యలకు పదును పెట్టినట్లు కనిపిస్తోంది. అమెరికా విఫలదేశమంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రత్యర్థులు మండిపడుతున్నారు.‘‘హంతక దుండగుడిగా వ్లాదిమిర్ పుతిన్ చర్యలను ఖండించాలి. లేదంటే అలెక్సీ నావల్నీ ధైర్యాన్ని పొగడాలి. అది కాకుండా అమెరికాను తక్కువ చేస్తూ.. మన దేశాన్ని రష్యాతో పోలుస్తున్నారు’’ అని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ విమర్శించారు.