అమెరికాలో 44 ఏళ్ల నాటి హత్యాచార కేసులో.. దొరికిన నిందితుడు
అమెరికాలో నాలుగు దశాబ్దాల కిందట ఓ హత్యకేసులో మిస్టరీ ఎట్టకేలకు వీడింది. చూయింగ్ గమ్‌లోని డీఎన్‌ఏ ఆనవాళ్లు దోషిని పట్టించడం గమనార్హం. దీంతో 60 ఏళ్ల రాబర్ట్ ప్లింప్టన్ కటకటాపాలయ్యాడు. ఓరెగాన్‌లోని మౌంట్ హూడీ కమ్యూనిటీ కళాశాలలో బార్బరా టక్కర్ (19) విద్యార్థిని. 1980 జనవరి 15న ఈమె అపహరణకు గురైంది. మరుసటిరోజు కళాశాలకు వచ్చిన విద్యార్థులు క్యాంపస్‌లోని పార్కింగు సమీపంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు లైంగికదాడి అనంతరం అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రాబర్ట్ ప్లింప్టన్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానించిన దర్యాప్తు అధికారులు అతడిపై పలు అభియోగాలు మోపారు. విచారణలో సరైన అధారాలు లభించకపోవడంతో కేసు మరుగునపడిపోయింది.
2000లో ఈ ఫైలు మళ్లీ తెరిచిన పోలీసులు హతురాలి శవపరీక్ష నాటి నమూనాలను ఒరెగాన్ స్టేట్ పోలీస్ (ఓఎస్‌పీ) క్రైమ్ ల్యాబుకు పంపించారు. అక్కడ వాటిని విశ్లేషించి డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను రూపొందించారు. అనంతరం రాబర్ట్ పైనా పోలీసులు నిఘా కొనసాగించారు. 2021లో ఓసారి అతడు చూయింగ్ గమ్ నమలడాన్ని చూసిన పోలీసులు దాన్ని సేకరించిన ఓఎస్‌పీ ల్యాబుకు పంపారు. గతంలో రూపొందించిన హతురాలి డీఎన్‌ఏ ప్రొఫైల్‌తో అది సరిపోలినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో 2021 జూన్ 8న రాబర్ట్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించారు. విచారణ జరిపిన న్యాయస్థానం అతడినికి దోషిగా తేల్చింది. రాబర్ట్ మాత్రం తాను నేరం చేయలేదని వాదించారు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లనున్నట్లు అతడి తరపున న్యాయవాదులు తెలిపారు. దీంతో ఈ కేసు తుది తీర్పు జూన్‌లో వెలువడే అవకాశముంది.