న్యూయార్క్ నగరంలో దీపావళి నాడు స్కూళ్లకు సెలవు.. వచ్చే ఏడాది నుంచి నిర్ణయం అమలు

వచ్చే ఏడాది నుంచి హిందూ పండుగ దీపావళిని న్యూయార్క్ నగరంలో పబ్లిక్ స్కూల్ హాలిడేగా జరుపుకోవాలని అక్కడి గవర్నర్ నిర్ణయించారు. ఈ మేరకు న్యూయార్క్ గవర్నర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. ఈ సమయంలో అసెంబ్లీ వుమెన్ జెన్నిఫర్ రాజ్ కుమార్, ఎడ్యుకేషన్ విభాగం ఛాన్సలర్ డేవిడ్ బ్యాంక్స్ కూడా ఆయనతోపాటు ఉన్నారు. ఇక నుంచి ఏటా జూన్ మొదటి గురువారం నాడు జరుపుకునే యానివర్సరీ డే స్థానంలో దీపావళిని స్కూల్ హాలిడేగా జరుపుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జెన్నిఫర్ మాట్లాడుతూ.. న్యూయార్క్ నగరంలో నివసించే సుమారు 2 లక్షల మంది హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు దీపావళిని వైభవంగా జరుపుకుంటారు అని చెప్పారు. దీంతో పోల్చుకుంటే యానివర్సరీ డే ఒక పాతకాలం నాటి, అంత ప్రాధాన్యం లేని సంప్రదాయం అని ఆమె అన్నారు. దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలని అంటే.. స్కూల్ కాలెండర్ లో ఖాళీ లేదని చాలామంది అన్నారని, కానీ తమ ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయంపై ముందుకేసాగి, ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని వివరించారు. దీపావళిని సెలవు దినం చేసినప్పటికీ.. ఏడాదిలో అవసరమైన 180 రోజుల పాటు స్కూళ్లు పనిచేస్తాయని వెల్లడించారు. నగరంలో నివసించే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న నిర్ణయం ఇదని, ఇప్పటికీ సాధ్యమైందని గవర్నర్ ఎరిక్ అన్నారు. అలాగే ఇక నుంచి విద్యార్థులు దీపావళి గురించి మరింత తెలుసుకునేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.