మరోసారి ఆ బ్యానర్ లో బన్నీ, త్రివిక్రమ్

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. తక్కువ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించింది. అంతే కాదు ఈ సినిమా టాలీవుడ్ లో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా చూడ్డానికి మామూలుగానే అనిపించినా, చాలా ఆహ్లాదంగా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కు మంచి ఫీల్ ని కలిగిస్తుంది. దానికి తోడు ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం సినిమాను తర్వాతి స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా కోసం టీమ్ లో ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అందుకే ఇలాంటి టీమ్ మళ్లీ జత కట్టాలనుకుంటోంది.
అవును, అల వైకుంఠపురములో సినిమాకు పనిచేసిన మెయిన్ కాస్ట్ అండ్ క్రూ కలిసి మళ్లీ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. బన్నీ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్టర్ గా అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. బన్నీతో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ముందునుంచి తెలుసు కానీ మళ్లీ ఇదే బ్యానర్ లో అని మాత్రం ఇప్పటి వరకు అనుకోలేదు.
రీసెంట్ గా బన్నీ, త్రివిక్రమ్ స్టోరీ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకు కూడా థమనే సంగీతం అందించే ఛాన్సుంది. మరి హీరోయిన్ గా పూజానే రిపీట్ చేస్తారా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం బన్నీ పుష్ప2, త్రివిక్రమ్ మహేష్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయా చిత్రాలు పూర్తి కాగానే వీరి కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.