ASBL NSL Infratech

'మత్తు' జగత్తు

'మత్తు' జగత్తు

సినిమా పరిశ్రమ- డ్రగ్స్ సయామీ కవలల్లా మారాయా? 2017లో టాలీవుడ్ డ్రగ్స్ దందా గురించి మరువక ముందే మరోసారి నిర్మాత కేపీ చౌదరి అరెస్టు .. టాలీవుడ్ ను ఊపేస్తోంది. గోవా కేంద్రంగా మాదకద్రవ్యాల సరఫరా కీలక సూత్రధారి నైజీరియన్‌ పెటిట్‌ ఎబ్యూజర్‌ అలియాస్‌ గాబ్రియేల్‌ కోసం గాలించిన పోలీసులు...అతనితో కేపీచౌదరికి సన్నిహిత సంబంధాలున్నట్టు  గుర్తించారు. ఇటీవలే అరెస్టయిన రోషన్‌ ఫోన్‌లో లభించిన ఆధారాలతో కేపీచౌదరిని పట్టుకున్నారు.

ఏడేళ్లుగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లోని పలువురితో కేపీకి దగ్గర సంబంధాలున్నాయి. గోవా, హైదరాబాద్‌ శివారు ఫామ్‌హౌస్‌ల్లో కేపీ ఏర్పాటు చేసిన ప్రయివేటు పార్టీలకు పలువురు నటులు హాజరైనట్టుగా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇతడు గోవాలో హోటల్‌ ప్రారంభించినప్పుడు నైజీరియన్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. వాటి ఆధారంగా అంతర్జాతీయ డ్రగ్‌ డీలర్లకు దగ్గరయ్యాడు. దాదాపు ఏడాదికాలంగా ఏపీ, తెలంగాణకు చెందిన స్థిరాస్తి వ్యాపారులు, సినీ, రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులు ఇతడి వద్దనే ఖరీదైన కొకైన్‌ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు.

నైజీరియన్‌ పెటిట్‌ ఎబ్యూజర్‌ అలియాస్‌ గాబ్రియేల్‌ పట్టుబడితే మాదకద్రవ్యాల లింకులు బయడపతాయంటున్నారు సైబరాబాద్‌ పోలీసులు. డ్రగ్స్ పెడలర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఫోన్లలో లభించిన కాల్‌డేటా ఆధారంగా కొనుగోలుదారుల వివరాలు రాబడుతున్నారు. కేపీ చౌదరి ఫోన్లలో సినీ రంగానికి చెందిన ఇద్దరు హీరోయిన్లు, నలుగురు నటీమణులు, ప్రముఖ దర్శకుడి ఫోన్‌ నంబర్లు, ఫొటోలను పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

దీంతో టాలీవుడ్ లో ఆందోళన కనిపిస్తోంది. ఇంతకూ ఈ కొనుగోలుదారుల జాబితాలో ఎవరున్నారు? ఇది ఎంతవరకూ వెళ్తుందన్న భయం.. సినీరంగాన్ని ఊపేస్తోంది. 2017 డ్రగ్స్ కేసులో పలువురికి నోటీసులిచ్చి. వారిని పిలిపించి విచారణ జరిపిన పోలీసులు...తర్వాత ఒక్కసారిగా కేసును నీరుగార్చారన్న ఆరోపణలున్నాయి. దీనికి  గానూ ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ఒత్తిడి కారణమని విపక్షాలు ఆరోపించాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ అయితే.. నేరుగానే కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు గుప్పించారు.

మరి ఈసారి ఈకేసు  ఎలా సాగనుంది? ఈసారైనా డ్రగ్స్ దందాలో కీలకంగా ఉన్నవారిని అరెస్టు చేస్తారా? అసలే వందలకోట్ల  రూపాయల విలువైన ఇండస్ట్రీ.. షూటింగ్ లుఆగితే వచ్చే పరిణామాలేంటి...? ఎంతమేర సినీపరిశ్రమ నష్టపోనుంది? ఇప్పుడిదే టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్ల మది తొలిచేస్తోంది. ఇప్పటికే కరోనా దెబ్బతో ఇండస్ట్రీ చాలావరకూ దెబ్బతింది. అయితే పాన్  ఇండియా మూవీస్ పుణ్యమా అని కొద్దికొద్దిగా కోలుకుంటోంది. ఇలాంటి తరుణంలో డ్రగ్స్ ఆరోపణలు ఎంతవరకూ తీసుకెళ్తాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :