ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : ప్రేక్షకుడిని కష్టపెట్టిన 'కస్టడీ'

రివ్యూ : ప్రేక్షకుడిని కష్టపెట్టిన 'కస్టడీ'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
నటీనటులు :అక్కినేని నాగచైతన్య, అరవింద్ స్వామి, ఆర్. శరత్ కుమార్, కృతిశెట్టి, ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు
సినిమాటోగ్రఫీ : కదిర్, ఎడిటింగ్: వెంకట్ రాజన్
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఇళయరాజా; సమర్పణ : పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, దర్శకత్వం: వెంకట్ ప్రభు
విడుదల తేదీ: 12.05.2023

అక్కినేని న‌ట వార‌సుడైన నాగ చైత‌న్య మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయ‌కుండా విల‌క్ష‌ణ‌మైన పాత్రల్లో సినిమాలు  చేస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపును సాధించుకున్నారు. అయితే మజిలీ చిత్రం తరువాత  నాగచైతన్యకి సరైన హిట్ లేదు. కస్టడీ ట్రైలర్ చూస్తే మాత్రం ఒక కానిస్టేబుల్ వీరగాధ అని అర్ధమౌతుంది. ఈ చిత్రానికి  దర్శకుడు వెంకట్ ప్రభు మీద నమ్మకంతో కాసిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు అరవింద్ స్వామి, శరత్ కుమార్ లాంటి అగ్ర నటులు కూడా తోడవ్వడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఇంతకీ సరైన కథాకథనాలతో ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించిందా? నాగ చైతన్య ఖాతాలో మరో హిట్ పడిందా ఈ సమీక్షలో తెలుసుకుందాం.

క‌థ‌:

1996లో సినిమా స్టార్ట్ అవుతుంది. రాజ‌మండ్రిలోని మారేడుపురంలో విష వాయువులు పేలుడు జ‌ర‌గ‌డంతో దాదాపు 40 మంది చ‌నిపోతారు. ఆ కేసుని ప్ర‌భుత్వం సీబీఐకి అప్ప‌గిస్తుంది. రెండేళ్ల త‌ర్వాత సకినేటి ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కి చెందిన కానిస్టేబుల్ శివ (నాగ చైత‌న్య‌) ముఖ్య‌మంత్రి దాక్షాయ‌ణి (ప్రియ‌మ‌ణి) సెక్యూరిటీ టీం లోకి వెళ‌తాడు. కానిష్టేబుల్ శివ కి, ఒక సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్) కి, సీఎం అండతో బతికే ఒక రౌడీషీటర్ (అరవింద్ స్వామి) కి, పోలీస్ కమీషనర్ (శరత్ కుమార్) కి మధ్యన జరిగే కథ ఇది. మరోవైపు రేవతి (కృతి శెట్టి) తో ప్రేమలో ఉంటాడు. రేవతి కూడా శివని ప్రాణంగా ప్రేమిస్తుంది. అయితే, కులాలు వేరు కావడంతో రేవతి ఇంట్లో శివతో పెళ్లికి ఒప్పుకోరు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజు, సీబీఐ ఆఫీసర్ జార్జ్ ను అరెస్ట్ చేసి స్టేషనుకు తీసుకొస్తాడు శివ. మరోవైపు రాజును చంపాడనికి పోలీస్ కమీషనర్ నటరాజన్ సహా ఏకంగా పోలీస్ ఫోర్స్, రౌడీలు రంగంలోకి దిగుతారు. మారేడుపురంలో జ‌రిగింది ప్ర‌మాదం కాద‌ని, రాజు చేసిన ప్లాన్ కార‌ణంగానే 40 మంది చ‌నిపోయార‌ని జార్జ్ చెబుతాడు. అదే స‌మ‌యంలో శివ ప‌నిచేసే స్టేష‌న్ ఎస్సై, ఎస్‌.పి, ఇత‌ర హ‌య్య‌ర్ ఆపీస‌ర్స్ రాజుని విడుద‌ల చేసి, సీబీఐ ఆఫీస‌ర్‌ని చంపేయ‌టానికి ప్లాన్ చేస్తారు. అప్పుడు శివ ఏం చేస్తాడు? శివ కార‌ణంగా స్టేట్ పోలీసులంతా అత‌న్ని ప‌ట్టుకోవాల‌నుకుంటారు. సీబీఐ ఆఫీస‌ర్‌ని, రాజుని త‌ప్పించిన శివ ఏం చేస్తాడు? శివ ఎందుక‌లా చేశాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

ఇక నటీనటుల విషయానికి వస్తే నాగచైతన్య సీరియస్ క్యారెక్టరైజేషన్లో అక్కడక్కడ ఓకే అనిపించాడు. పైగా తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో నాచైతన్య చాలా సెటిల్డ్ గా నటించాడు. కాకపోతే  వీక్ రైటింగ్ వల్ల అతని హీరోయిజం పెద్దగా రిజిస్టర్ కాలేదు.  కృతిశెట్టి పక్కింటమ్మాయి టైపులో సింపుల్ గా పాత్రకి తగ్గట్టుగా ఉంది. మరొక కథానాయిక ఆనంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అతిధి పాత్ర టైపులో కనిపిస్తుంది. ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ అరవింద్ స్వామి. నమ్మిందే న్యాయం అనుకుని అతని చేసే క్రైమ్ లో కూడా కామెడీ పడిస్తూ అరవింద్ స్వామి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అరవింద్ స్వామి పలికిన కొన్ని డైలాగ్స్ కూడా పేలాయి. బిల్డప్ బానే ఇచ్చారు కానీ దానికి తగిన క్యారెక్టర్ కాదు. అయినప్పటికీ ఉన్నంతలో ఈ పాత్రే చివరిదాకా ఉండి క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తుంది. శరత్ కుమార్ విలనీ బానే ఉంది. ముఖ్యమంత్రిగా కనిపించిన ప్రియమణికి బిల్డప్ షాట్స్ ఫుల్, పవర్ఫుల్ డైలాగ్స్ అవసరం లేదు అన్నట్టుగా రాసుకున్నారు. రాంకీ, జయసుధ.. ఇలా ప్రతి చిన్న సీన్లోనూ పెద్ద పెద్ద నటుల్ని, మాజీ హీరోలని, అలనాటి హీరోయిన్ ని వాడేయడం జరిగింది. ప్రేమ్ జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

సాంకేతికవర్గం పనితీరు:

అత్యంత బలహీనమైన కథారచన కి ఈ సినిమా ఒక ఉదాహరణ. కథ, కథనం, డైలాగ్ ఇలా ఏ విభాగంలోనూ కూడా బలం లేకుండా తీయడం వెంకట్ ప్రభుకే చెల్లింది. టెక్నికల్ గా యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ బాగుంది. సింగిల్ షాట్ ఫైట్ సీక్వెన్స్ ఇంకా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త భిన్నంగా ఉండి అక్కడక్కడ ఓకే అనిపించినా ఎక్కువ శాతం నీరసపరిచింది. కెమెరా వర్క్ బాగున్నా ఎడిటింగ్ పదును లేకుండా ఉంది. మళ్లీ మళ్లీ ఒకే తరహా సీన్స్ రావడం కాస్త  చిరాకు అనిపించింది. యువన్ శంకర్ రాజా, ఇళయరాజా, ఒకరు కాదు ఇద్దరు ఉద్దండ సంగీత దర్శకులు.కానీ సంగీతపరంగా ఆకట్టుకోలేకపోయింది. పాటల్లోని సంగీత సాహిత్యాలు దారుణంగా ఉన్నాయి అరవ డబ్బింగు సినిమా పాటల్ని పోలి ఉన్నాయి. నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంలో పోలీస్ ఆఫీసర్ దుస్తుల్లో కనిపించిన నాగ చైతన్య తఢాఖా చిత్రం చివరలోనూ పోలీస్ ఆపీసర్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైతన్య పోలీస్‌గా నటించిన చిత్రం కస్డడీ. పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరో కనిపిస్తాడంటే యాక్షన్ ఎలిమెంట్స్‌కి కొదవే ఉండదని అభిమానులు భావిస్తారు. అది నిజమే.. కస్టడీ సినిమాలో ఛేజింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే నాగ చైతన్య యాక్షన్స్ కాస్త రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. ఫైట్స్ ఉన్నాయి కానీ హీరో కొడితే పది మంది రౌడీలు ఎగిరి పడే రేంజ్‌లో మాత్రం లేవు. చైతన్య పాత్రను ఎమోషన్స్, మాస్ అంశాలను మిక్స్ చేసి తెరకెక్కించారు. ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. మెయిన్ పాయింట్ తో పాటు కొన్ని యాక్షన్ అండ్ కామెడీ సీన్స్ బాగున్నాయి. ఐతే, కథ సింపుల్ గా ఉండటం, స్క్రీన్ ప్లే కూడా స్లోగా సాగడం, అలాగే లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా, సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :