ASBL Koncept Ambience
facebook whatsapp X

మూడో ప్రపంచయుద్ధానికి బాటలు పడుతున్నాయా..?

మూడో ప్రపంచయుద్ధానికి బాటలు పడుతున్నాయా..?

హమాస్ పై యుద్ధం పేరుతో ఇజ్రాయెల్ రెచ్చిపోతోంది. ప్రపంచదేశాలు .. వద్దు మొర్రో అని గొంతెత్తి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. మొన్నటివరకూ గాజాలో హమాస్ యుద్ధ టన్నెల్స్ ఉన్నాయని చెబుతూ వచ్చింది. వాటిని ధ్వంసం చేస్తూ పోయింది. అయితే అంతటితో ఆగలేదు. ఏకంగా గాజా ప్రజలపై వార్ ప్రకటించింది ఇజ్రాయెల్.. ప్రజలపై వార్ అని ఎందుకనాల్సి వస్తుందంటే... ఇజ్రాయెల్ రక్షణదళం వ్యూహాలకు గాజా పౌరులు బలవుతున్నారు కాబట్టి. ఒకప్పుడు తమ ఇంటిలో వచ్చిన సంపాదనతో పిల్లా, పాపలతో గుట్టుగా బతికిన గాజా పౌరుల బతుకు... బిచ్చగాళ్లకన్నా హీనంగా తయారైంది.

ఐక్యరాజ్యసమితి సహాయం, ఇతర దేశాలు పంపుతున్న సాయం కోసం.. వారు ఎగబడుతున్న తీరు చూస్తుంటే గుండెల నుంచి దుంఖం తన్నుకువస్తుంది. వారేం పాపం చేశారని.. ఈయుద్ధంలో సమిధలవుతున్నారు. దీనికి ఇజ్రాయెల్ చెప్పేది ఒకే ఒక్క మాట.. హమాస్ దాడిలో మావాళ్లు.. 12 వందల మందికి పైగా మృతి చెందారు. కాబట్టి హమాస్ ను వేటాడుతామని. వేట కొనసాగుతోంది.కానీ .. దానికి ఓ నిర్ధిష్ట కార్యాచరణ లేకుండా పోయింది. ఎక్కడ హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని అనుమానం వచ్చినా అక్కడ బాంబింగ్ జరుగుతోంది. అందులో పిల్లా, పాప.. కుటుంబాలు ఉన్నాయన్న ఆలోచన లేదు. దీంతో వేలాది మంది, వందలాది కుటుంబాలు.. తమ ఇళ్లలోనే సమాధయ్యాయి.

ఇక.. అక్కడితో ఆగడం లేదు ఇజ్రాయెల్.. పొరుగున ఉన్న దేశాల్లో తలదాచుకున్న హమాస్ లీడర్లను మట్టుపెడుతోంది. అయితే నేరుగా ఆయా దేశాల్లో బాంబింగ్స్ చేపడుతోంది. మొన్నటివరకూ లెబనాన్ లోదాడులు చేస్తున్న ఇజ్రాయెల్... ఇప్పుడు లేటెస్టుగా సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయ కాన్సులర్‌ విభాగంపై వైమానిక దాడి చేసింది. ఈదాడిలో ఏడుగురు అధికారులు మృతి చెందినట్లు ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ ధ్రువీకరించింది. దీంట్లో సీనియర్‌ కమాండర్లు మొహమ్మద్‌ రెజా జహేదీ, మొహమ్మద్‌ హదీ హజీ రహీమీ ఉన్నట్లు వెల్లడించింది. జహేదీ ఇరాన్‌కు సైనిక సలహాదారుగా వ్యవహరిస్తుండగా.. రహీమీ ఖుద్స్‌ దళాలకు సమన్వయకర్తగా పనిచేస్తున్నారు.

ఈ దాడి ఇజ్రాయెల్‌ పనేనని ఇరాన్‌ ఆరోపించింది. ఎఫ్‌-35 యుద్ధ విమానాలతో దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని.. ప్రతిస్పందన తప్పదని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబారి హుస్సేన్‌ అక్బరీ హెచ్చరించారు. ఇలా ఒక అధికారిక భవనంపై ఇజ్రాయెల్‌ దాడి చేయడం బహుశా ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. డమాస్కస్‌లో దాడి, ఇరాన్‌ ఆరోపణలపై ఇజ్రాయెల్‌ ఆచితూచి స్పందించింది. దాడిలో ధ్వంసమైన భవనం రాయబార కార్యాలయం కాదని.. అది ఖుద్స్‌ దళాలకు కేంద్రంగా ఉందని సైనిక అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ అన్నారు. తాజా దాడితో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి తప్పకుండా ప్రతీకార దాడి ఉంటుందని.. దాన్ని ఎప్పుడు? ఎలా? ఎంత తీవ్రతతో చేపట్టాలనేది త్వరలో నిర్ణయిస్తామని ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నాజిర్‌ కనానీ హెచ్చరించారు.

ఇప్పుడు ఇలా.. పశ్చిమాసియాలోని ఇతర దేశాలపైనా ఇజ్రాయెల్ దళాలు నేరుగా దాడులు చేస్తుండడం.. పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. ఎంత అమెరికా దన్ను ఉన్నప్పటికీ.. ఇంతలా నేరుగా దాడులు జరపడం.. ఆయా దేశాలను ఆగ్రహానికి గురి చేస్తోంది. దీంతో ఈ ప్రభావం అమెరికాను తాకుతోంది. ఓవైపు సుద్ధులు చెబుతూ.. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ కు ఆయుధాలిస్తుండడం.. అరబ్ దేశాలను మరింత మండిస్తోంది. ఈఆగ్రహ జ్వాలను చల్లార్చడం.. ప్రస్తుతం ప్రపంచదేశాలపై ఉన్న బాధ్యతగా చెప్పొచ్చు.లేకుంటే కార్చిచ్చులా మొదలై దావానలంలా మారితే.. ఆ ఊహే భయానకమని చెప్పక తప్పదు. ఇది కాస్తా మూడో ప్రపంచయుద్ధానికి దారితీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతర్జాతీ సమాజం, మరీ ముఖ్యంగా అమెరికాపై ఉందని దౌత్య నిపుణులు చెబుతున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :