ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవం సాధ్యమా..?
ఆంధ్రప్రదేశ్ లో పునర్వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం మళ్లీ వైఎస్ కుటుంబాన్నే నమ్ముకుంది ఆ పార్టీ. రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కదలికి వచ్చింది. తాజాగా ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధ్యమవుతుందా..? కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు వస్తాయా..? ఎన్నికల ఖర్చు భరించేంత శక్తి పార్టీ నేతలకు ఉందా..?
కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కంచుకోట. ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన సీట్లతోనే కేంద్రంలో ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే అదంతా గతం. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చాలా మంది నేతలు రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. మరికొంతమంది వేరే పార్టీల్లో చేరిపోయారు. దీంతో పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. 2014లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 2.8శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఒక్క సీటు కూడా దక్కలేదు. 2019 నాటికి మరింత దిగజారి 1.17 శాతం ఓట్లు వచ్చాయి. పోటీ చేసిన వారెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.
కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేందుకు రఘువీరా రెడ్డి, శైలజానాథ్ లాంటి నేతలు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల రూపంలో ఆ పార్టీకి పెద్ద రిలీఫ్ కలిగింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆమె జగన్ నుంచి దూరం కావడం, తెలంగాణలో పార్టీ పెట్టడం.. దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం.. ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టడం.. చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. వైఎస్ కాంగ్రెస్ వాది కాబట్టి ఆయన చరిష్మా పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని పార్టీ నమ్ముతోంది.
షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం ద్వారా సత్తా చాటాలనేది ఆమె ప్లాన్. ఇందుకోసం అభ్యర్థులను వడపోసి ఎంపిక చేశారు. కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే రఘువీరా రెడ్డి లాంటి సీనియర్లు బరిలో దిగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఓడిపోతామని తెలిసీ బరిలోకి దిగడం ఎందుకని రఘువీరా రెడ్డి లాంటి నేతలు భావిస్తున్నారా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంతమంది సీనియర్లు కూడా పోటీ చేసేందుకు విముఖంగా ఉన్నారు.
ఆర్థికంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి గొప్పగా లేదు. ఆ పార్టీ తరపున పోటీ చేసే నేతలు కూడా ఆర్థికంగా బలవంతులు కాదు. ఇప్పుడు ఎన్నికలంటేనే భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మరి ఇలాంటప్పుడు అభ్యర్థుల ఖర్చు ఎవరు భరిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అందుకే పోటీ చేసేందుకు చాలా మంది నేతలు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల ఎలా పార్టీని గట్టెక్కిస్తారనేది అంతుచిక్కని ప్రశ్న. గత ఎన్నికల కంటే ఓట్ల శాతాన్ని పెంచుకోవడంతో పాటు కనీసం ఒకటి రెండు సీట్లలోనైనా గట్టి పోటీ ఇవ్వగలిగితే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయినట్లే లెక్క. మరి చూడాలి ఏం జరుగుతుందో..!