హస్తం వ్యూహం..

తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ హైకమాండ్ పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసిందా? ముక్కోణపు పోటీ హోరాహోరీగా జరిగితే బీఆర్ఎస్ కే లాభమని భావిస్తున్న కాంగ్రెస్.. అందుకు తగిన కౌంటర్ ప్లాన్స్ రూపొందించిందా? న్యూయార్క్ లో ప్రవాసభారతీయుల డిన్నర్ మీట్ లో రాహుల్ వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గురించి ప్రస్తావించని రాహుల్.. కర్నాటక తరహాలో తెలంగాణలోనూ బీజేపీని నామరూపాల్లేకుండా చేస్తామని వ్యాఖ్యానించారు.
లోక్‌సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నా, దక్షిణాది రాష్ట్రాల వాటా తక్కువే. అయితే, తెలంగాణలో మాత్రం.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా సత్తా చాటి నాలుగు స్థానాలను దక్కించుకుంది. తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గణనీయ స్థానాలు దక్కించుకుంది. ఓ దశలో కాంగ్రెస్ ను తోసిరాజని బీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా రేసులోకి వచ్చింది.
కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం తెలంగాణ బీజేపీపై ప్రభావం చూపింది. ఇప్పటికే గ్రామీణ నియోజకవర్గాల్లో బలహీనంగా ఉందని, చేరికల్లో వేగం కొరవడిందని రాష్ట్ర బీజేపీ లోపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి చేరిన నాయకులు పలువురు పునరాలోచనలో పడినట్లు ఊహాగానాలు సాగాయి. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలు రాష్ట్రంలో బీజేపీపై కాంగ్రెస్ దృష్టిపెట్టిందా? అన్న చర్చకు దారితీశాయి.
వాస్తవానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి కొందరు బలమైన నేతలు బీజేపీలో చేరాక ఆ పార్టీ ప్రత్యామ్నాయ రేసులోకి వచ్చింది. కానీ, ఇలా చేరినవారు ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు బీజేపీ నుంచి పెద్దఎత్తున నేతలను పార్టీలోకి ఆకర్షించేందుకు అధిష్ఠానం చేస్తున్న కసరత్తులో భాగమా? అన్న చర్చకు తెరలేపాయి.
ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీజేపీని బలహీనపరిస్తే బీఆర్‌ఎస్- కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ ఉంటుంది. ఓటర్ల మొగ్గూ దీనికి అనుగుణంగానే జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉన్నందున రాహుల్ మాటల వెనుక మర్మం తొందర్లోనే తేలుతుందని అంటున్నాయి.






