కుప్పం, పిఠాపురం పై కన్నేసిన కాంగ్రెస్..
ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలలో 114 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది. పార్టీని నమ్ముకున్న కురువృద్ధుల నుంచి యువ నాయకుల వరకు చాలామందికి అవకాశం దక్కింది. ఈసారి కళ్యాణదుర్గం స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున రఘువీరారెడ్డి పోటీ చేస్తున్నారు. సింగమల నియోజకవర్గం నుంచి సీనియర్ నేత సాకే శైలజానాథ్ బరిలోకి దిగుతున్నారు. 2004 ,2009 ఎన్నికలలో సింగనమలలో సాకే వరుస విజయాలు అందుకున్నారు. ఇటు చింతలపూడి నియోజకవర్గంలో ఎలీజా కు టికెట్టు కేటాయించారు. వ్యక్తిగతంగా ఆ నియోజకవర్గంలో బలమైన నాయకుడు కాబట్టి అతను కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా పోటీ చేసే కుప్పం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆవుల గోవిందరాజులు టికెట్ కేటాయించారు. అలాగే పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మేడేపల్లి సత్యానందరావుకి కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. ఎంతో వ్యూహాత్మకంగా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను పోటీకి దింపి ఓట్లు చీలే విధంగా హస్తం ప్లానింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.