ASBL NSL Infratech

స్పీడ్ పెంచనున్న జగన్..! 18న మేనిఫెస్టో విడుదల..!!

స్పీడ్ పెంచనున్న జగన్..! 18న మేనిఫెస్టో విడుదల..!!

ఒకవైపు అసెంబ్లీ, మరోవైపు లోక్ సభ.. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే రెండింటికీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అందరి చూపూ ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది. ముఖ్యంగా అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమవుతుండడం మరింత ఆసక్తి రేకిత్తిస్తోంది. జగన్ సర్కార్ ను గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతోనే తాము పొత్తు పెట్టుకుంటున్నట్టు ఆయా పార్టీలు చెప్తున్నాయి. అయితే వైసీపీ మాత్రం ఒంటరి పోరుకే సిద్ధమైంది. సింహం సింగిల్ గానే వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

వాస్తవానికి ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం 2019లాగానే ఇప్పుడు కూడా మార్చిలోనే షెడ్యూల్ విడుదలవుతుందని తెలుస్తోంది. మార్చి రెండు - మూడు వారాల్లో షెడ్యూల్ విడుదలవుతుందని సమాచారం. ఏప్రిల్, మే నెలల్లో వివిధ దశల్లో పోలింగ్ జరుగుతుందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా తమ ప్రచార కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాయి. ఏపీ సీఎం జగన్ కూడా ఈ మేరకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నెల 16న చేయూత కార్యక్రమానికి సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్. ఆ తర్వాత 18న అనంతపురంలో సిద్ధం సభ జరగనుంది. ఇప్పటికే ప్రాంతాలవారీగా సిద్ధం సభలు నిర్వహిస్తోంది వైసీపీ. అనంతపురంలో చివరి సిద్ధం సభ జరగనుంది. ఈ సమావేశంలోనే పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత 21న అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేయనున్నారు. 24న కర్నూలులో బీసీ నేస్తం, 27న గుంటూరులో విద్యానేస్తం నాలుగో విడత నిధులు రిలీజ్ చేయనున్నారు. అనంతరం మార్చి 5న సత్యసాయి జిల్లాలో వసతి దీవెన నిధులు విడుదల చేస్తారు.

ఇక మార్చి 6న చివరి కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే సమయం కేటాయించాలని జగన్ నిర్ణయించారు. మార్చి 7 నుంచి ఏప్రిల్ 14వరకూ 40 రోజుల పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉండేందుకు జగన్ సిద్ధమయ్యారు. 120 అసెంబ్లీ  నియోజకవర్గాలు, 21 పార్లమెంటు స్థానాల్లో జగన్ పర్యటనలు ఉండేలా పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. రోజుకు మూడు మీటింగుల్లో జగన్ పాల్గొనేందుకు జగన్ రెడీ అయ్యారు. పూర్తిగా సంక్షేమ పథకాలపైనే జగన్ ఆశలు పెట్టుకున్నారు. అవే తమను గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. అయితే సంక్షేమ పథకాల మాటున అభివృద్ధిని పక్కన పెట్టేశారనే ఆరోపణలున్నాయి. దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి కలిగిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :