ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలంగాణపైకి చంద్రబాబు దృష్టి ఎందుకు మళ్లింది..?

తెలంగాణపైకి చంద్రబాబు దృష్టి ఎందుకు మళ్లింది..?

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలిచిన తర్వాత ఫుల్ జోష్ లో ఉన్నారు ఆ పార్టీ నేతలు. కేవలం రాష్ట్రంలోనే కాక కేంద్రంలో కూడా చక్రం తిప్పే స్థాయి దక్కడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు చంద్రబాబును కలిసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే చంద్రబాబు హైదరాబాద్ లో అడుగు పెట్టినప్పుడు ఆయనకు ఘన స్వాగతం పలికారు టీడీపీ నేతలు, అభిమానులు. ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబుకు సన్మానం కూడా చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.

తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని ఆయన ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలకు సూచించారు. త్వరలోనే అధ్యక్షుడిని నియమిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ టీడీపీకి ఆదరణ ఉందని.. ఇటీవలి ఎన్నికల్లో తన గెలుపుకు తెలంగాణ కార్యకర్తలు, నేతలు కూడా పని చేశారని చెప్పారు. కొన్ని జిల్లాల్లో ఇతర పార్టీల నేతలను గెలిపించడంలో టీడీపీ పాత్ర పోషించిందనే విషయాన్ని పరోక్షంగా ఆయన వివరించారు. గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు పార్టీని బలోపేతం చేస్తే మళ్లీ చక్రం తిప్పొచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

త్వరలోనే తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నెల 19న మరోసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి ఆరోజు అధ్యక్షుడిని నియమిస్తారని తెలుస్తోంది. అరవింద్ కుమార్ గౌడ్ ఈ రేసులో ముందంజలో ఉన్నారు. అధ్యక్షుడిని మాత్రమే కాకుండా జిల్లాల వారీగా కూడా పార్టీని బలోపేతం చేసుకునేందుకు చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు హైదరాబాద్ వచ్చిన వెంటనే పలువురు నేతలు వెళ్లి ఆయన్ను కలిశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. దీంతో తెలంగాణలో కూడా టీడీపీకి కొత్త ఉత్సాహం వచ్చింది.

అయితే టీడీపీ బలోపేతం అవ్వాలంటే ఇక్కడ కొన్ని చిక్కుముళ్లు ఉన్నాయి. టీడీపీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. కేంద్రంలో, ఏపీలో బీజేపీతో కలిసి పనిచేస్తోంది. మరి తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి పనిచేస్తుందా అనేది డౌటే.! మరోవైపు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేసేందుకే టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయలేదనే అపవాదు ఉంది. వాస్తవానికి అది నిజం కూడా. ఖమ్మం, హైదరాబాద్ లాంటి చోట్ల టీడీపీ శ్రేణులు నేరుగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాయి. ఫలితాల తర్వాత కూడా టీడీపీ శ్రేణులకు కాంగ్రెస్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు పార్టీ బలోపేతం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ శ్రేణులపై ఆధారపడే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ను మాత్రమే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి బీఆర్ఎస్ ను కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే కకావికలం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలను కాదని టీడీపీ వైపు పెద్ద నేతలు వస్తారని ఆశించలేం. అయితే హైదరాబాద్, ఖమ్మం లాంటి చోట్ల టీడీపీకి ఎప్పుడూ నిర్దిష్టమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. సరైన నేతలు ఉంటే కాస్తోకూస్తో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :