ASBL NSL Infratech

చిరంజీవి జనసేనలో చేరడం ఖాయమా..?

చిరంజీవి జనసేనలో చేరడం ఖాయమా..?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. చిరంజీవి అలా మాట్లాడగానే చాలా మంది త్వరలో ఆయన జనసేనలో చేరతారని.. తమ్ముడితో కలిసి ప్రయాణం చేస్తారని భావిస్తున్నారు. ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇకపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారని మెగా ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. మెగా ఫ్యామిలీని వైసీపీ టార్గెట్ చేసిందని.. ఇప్పుడు అందరికీ తగిన సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని హెచ్చరిస్తున్నారు. కానీ చిరంజీవి నేరుగా ఎక్కడా రాజకీయాలపై మాట్లాడలేదు. చాలాకాలం కిందటే ఆయన పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పుకున్నారు. సినిమాలకే పరిమితం అయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన ఆయన చాలా తక్కువ సమయంలోనే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్, వైఎస్ రాజశేఖర రెడ్డి అండదండలతోనే ఆయన పార్టీ పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారం చేజిక్కించుకునేటన్ని సీట్లు రాకపోవడంతో ఆయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. కేంద్రంలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఆయన అధికారికంగా రాజీనామా చేయలేదు. ఇప్పటికీ చిరంజీవి తమవాడేనని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది. కానీ చిరంజీవి మాత్రం ఆ పార్టీతో తెగదెంపులు చేసేసుకున్నారు. సినిమాలకే పరిమితం అయ్యారు.

సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత అందరివాడు అనిపించుకునేందుకు చిరంజీవి ప్రయత్నించారు. ఇండస్ట్రీ పెద్దగా తనను అందరూ గుర్తించాలని తాపత్రయ పడ్డారు. అవునన్నా కాదన్నా చిరంజీవే ఇప్పుడు ఇండస్ట్రీలో అన్ని రకాలుగా పెద్దాయన. చిరంజీవికి ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది. దీంతో ఇండస్ట్రీ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆయా ప్రభుత్వాలను కలిసి పరిష్కరించాలనుకున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులను వెంటబెట్టుకుని ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ముఖ్యమంత్రులను కలిసి వచ్చేవారు. అయితే ఆంధ్రా సీఎం తమ అభిమాన హీరోను అవమానపరిచారనే కోపం మెగా ఫ్యాన్స్ లో ఉంది. జగన్ ముందు చేతులు కట్టుకునే పరిస్థితి చిరంజీవి కల్పించారని పవన్ కల్యాణ్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వైసీపీపై అదనుకోసం వెయిట్ చేస్తున్నారు.

తాజాగా వాల్తేరు వీరయ్య 200 రోజుల సమావేశంలో చిరంజీవి చేసిన కామెంట్స్ వైసీపీని ఉద్దేశించేనని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సినిమా హీరోల రెమ్యునరేషన్ పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఇలా మాపై ఎందుకు పడి ఏడుస్తారని.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకని చిరంజీవి ప్రశ్నించారు. దీంతో వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఇప్పుడు సీన్ వైసీపీ వర్సెస్ మెగా ఫ్యామిలీగా మారిపోయింది. దీంతో ఇక చిరంజీవి తమ్ముడు పవన్ తో కలిసి పాలిటిక్స్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు చిరంజీవి అలా చేస్తారని అనుకోవట్లేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :