ఆ పిల్లలకు శాశ్వత నివాస హక్కు ఇవ్వాలి

వృత్తి ఉద్యోగాలపై అమెరికాకు వచ్చిన వారి సంతానానికి 21 ఏళ్ల వయసు రాగానే ఆ పిల్లలు స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలనే నిబంధనను తొలగించడానికి పాలక, ప్రతిపక్ష సభ్యులు అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయ సభల్లో బాలల బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్ 1బి. ఎల్ 1, ఈ1, ఈ2 వీసాలపై అమెరికాకు వలస వచ్చిన విదేశీయులు పిల్లలు 2,50,000 మంది వరకు ఉంటారు. వారిలో అత్యధికులు భారతీయ అమెరికన్లే. తల్లిదండ్రులు శాశ్వత పౌరసత్వమిచ్చే గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తుంటే, అది వచ్చే లోపు వారి పిల్లలకు 21 ఏళ్లు దాటిపోవచ్చు. ఆ సమయం రాగానే పిల్లలు వారివారి దేశాలకు తిరిగి వెళ్లిపోవలసి ఉంటుంది. దీన్ని సరిదిద్దడానికి అమెరికా కాంగ్రెస్‌లో బాలల బిల్లును ప్రతిపాదించారు. ఉపాధి వీసాలపై వచ్చిన తల్లిదండ్రలతో పాటు వారి పిల్లలూ అమెరికాకు వచ్చి మొత్తం పదేళ్లపాటు ఇక్కడ నివసించి, ఉన్నత విద్యా కోర్సులో పట్టభద్రులైతే వారికి శాశ్వత నివాస హక్కు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.