ASBL NSL Infratech

కూటమిలో ఉత్సాహం...?

కూటమిలో ఉత్సాహం...?

ఏపీలో మార్పు ప్రారంభమైందా...? ప్రభుత్వ వ్యతిరేకత ఉప్పెనలా ఎగసిపడిందా..? ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న థ్యేయం, కసి ఓటరు కళ్లలో కనిపించిందా..? అందుకే ఓటరు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేశాడా..? అంటే అవుననే అంటున్నారు కూటమి నాయకులు. ఎన్నడూ చూడని విధంగా హయ్యెస్ట్ పర్సంటేజ్ ఓటు పోలవడం వెనక.. కూటమిపై వేవ్ ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈసారి తమకు 120 కంటే అధికంగా సీట్లు రావడం పక్కా అంటున్నారు. తమ అధినేత చంద్రబాబు ఎలక్షన్ ఇంజినీరింగ్ పక్కాగా పనిచేసిందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి అమరావతి రాజధాని విధ్వంసం వరకూ సీఎం జగన్ చేయని పని లేదని గుర్తు చేస్తున్నారు కూటమి నేతలు. అన్నివర్గాల ప్రజలను జగన్ బాధించారని.. ఆయా వర్గాలు ఇప్పుడు తమ అవకాశాన్ని చక్కగా వాడుకున్నారని.. కూటమి గుర్తులపై ఓట్లు గుద్దేశారంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఈసారి వైసీపీని టార్గెట్ చేశారని ఘంటాపథంగా చెబుతున్నారు కూటమి నేతలు. ఉద్యోగులు, నిరుద్యోగులు, వారి కుటుంబాలు.. కూటమికి తమ ఓటు వేశారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా కూటమి సూపర్ సిక్స్.. అద్భుతంగా పనిచేసిందనిచెబుతున్నారు. ఇక ఈ వైసీపీ సర్కార్ అధికారంలో ఉంటే.. రాష్ట్రం గతి అథోగతి అని గుర్తించే.. కూటమికి ఓటేశారంటున్నారు. దీనికి తోడు కూటమిలో మూడుపార్టీల మధ్య కోఆర్డినేషన్ చక్కగా పనిచేసిందంటున్నారు. మూడుపార్టీల మధ్య ఓటుబదిలీ కావడంతో పలుచోట్ల పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమైందని చెబుతున్నారు. అన్నింటికీ మించి జగన్ పై ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపించిందంటున్నారు.

అన్నింటికీ మించి వైఎస్ వివేకా హత్యకేసులో దోషులను సీఎం జగన్ రక్షిస్తున్నారంటూ చెల్లెళ్లు షర్మిల, సునీత చేసిన ఆరోపణలు సైతం కీలకపాత్ర పోషించాయని చెబుతున్నారు. సొంత కుటుంబసభ్యులే జగన్ ఎలాంటి వ్యక్తి అన్న విషయాన్ని ప్రజల్లో వివరించడంతో వైఎస్ సానుభూతిపరులు సైతం.. తమ ఓటును కూటమికి వేశారని, మరికొందరు కాంగ్రెస్ వైపు మళ్లారంటున్నారు. జగన్ చెబుతున్నట్లు .. ఎస్సీ.,ఎస్టీ , మైనార్టీలు సైతం ... కూటమికే ఓటేశారని చెబుతున్నారు కూటమి నేతలు. అవి ఎంతవరకు నిజమన్నది వచ్చేనెల నాలుగున తేలనుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :