బీజేపీతో పొత్తును చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారు..?
ఏపీలో పొత్తులు ఓ కొలిక్కి వస్తున్నాయి. వైసీపీది ఎప్పుడూ ఒంటరిపోరే. పైగా బలమైన శక్తితో ఆ పార్టీ అధికారంలో ఉంది. చరిత్రలో ఎన్నడూ లేని విజయం సాధించిన ఆ పార్టీని ఓడించాలంటే మరే పార్టీకి శక్తి సరిపోవట్లేదు. అందుకే మిగిలిన పార్టీలన్నీ జట్టు కడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. వీటితో జత కట్టేందుకు బీజేపీ కూడా తోడవుతోంది. దీంతో ఆ మూడు పార్టీలూ కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీతో పొత్తును ఎలా సమర్థించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే విషయం మనకు తెలుసు. బీహార్ లో నితీశ్ కుమార్ ఇప్పటివరకూ ఎన్నోసార్లు బీజేపీని వదిలి కాంగ్రెస్ పంచన చేరారు. తర్వాత వెంటనే బీజేపీ గూటికి చేరారు. నితీశ్ తో పోల్చితే చంద్రబాబు నయం అనిపిస్తుంది. ఒక్కసారే బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటికొచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీకి చేరువ అవుతున్నారు. అయినా చాలామంది చంద్రబాబు తీరును తప్పుబడుతున్నారు. బీజేపీని నానా మాటలు అని ఆ పార్టీతో యుద్ధం ప్రకటించి.. ఇప్పుడు మళ్లీ స్నేహం చేయడం అవకాశవాదం కాదా అని ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా ఇది అవకాశవాదమే. టీడీపీది మాత్రమే కాదు.. బీజేపీది కూడా అవకాశవాదమే.
టీడీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ ఇంట్రస్ట్ చూపించిందా.. లేకుంటే బీజేపీతో వెళ్లాలని టీడీపీ ఉబలాటపడిందా.. అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరం. విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీయే టీడీపీతో కలిసి వెళ్లేందుకు ఆసక్తి కనబరిచిందని తెలుస్తోంది. దీని వెనుక బీజేపీకి ఉండే కారణాలు ఆ పార్టీకి ఉన్నాయి. అయితే బీజేపీ ఆఫర్ ను తిరస్కరించే పరిస్థితిలో చంద్రబాబు లేరు. కేంద్రంలో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ ఆఫర్ ను తిరస్కరించి మళ్లీ సమస్యలు కొనితెచ్చుకోలేరు. అందుకే బీజేపీతో కలిసి వెళ్లేందుకే మొగ్గు చూపారు.
అయితే బీజేపీతో ప్రయాణాన్ని ప్రజలకు వివరించి చెప్పడం చంద్రబాబుకు పెద్ద సవాలే. అయితే రాష్ట్ర ప్రయోజనాలకోసమేనని చంద్రబాబు చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రధాన అవసరాలను కేంద్రం తీరుస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంలో మళ్లీ మోదీయే వస్తారు కాబట్టి రాష్ట్రంలో కూడా కేంద్ర అనుకూల ప్రభుత్వం వస్తే బాగుంటుందని జనం సాధారణంగా కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని ఇటు టీడీపీ, అటు బీజేపీ ఫోకస్ చేసే అవకాశం ఉంది.