ASBL Koncept Ambience
facebook whatsapp X

అమరావతే చంద్రబాబు ఫస్ట్ ప్రయారిటీ.! కానీ అడుగడుగునా ఆటంకాలే.!!

అమరావతే చంద్రబాబు ఫస్ట్ ప్రయారిటీ.! కానీ అడుగడుగునా ఆటంకాలే.!!

ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజిత ఏపీకి రాజధాని లేకుండా పోయింది. మొదటి ఐదేళ్లూ పాలించిన టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అక్కడ భూములు సేకరించి తాత్కాలిక కార్యాలయాలు నిర్మించి పాలన సాగించింది. ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధాని నగరంగా అమరావతిని తీర్చి దిద్దాలనే ఆలోచనతో ఐకానిక్ భవనాలకు డిజైన్లు సిద్ధం చేసింది. వాటికి శంకుస్థాపన కూడా చేసేసింది. ఇంతలో ఎన్నికలు రావడం.. టీడీపీ ఓడిపోవడం చకచకా జరిగిపోయాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో ఏపీ రాజధాని వ్యవహారం మొదటికొచ్చింది.

అమరావతి కోసం ఓ వైపు.. మూడు రాజధానులకోసం ఓ వైపు అనేక వాదోపవాదాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో రాజధానిపై అనుమానాలు తొలగిపోయాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు అమరావతే తమ రాజధాని అని మొదటి నుంచి క్లారిటీగా ఉండడంతో ప్రాబ్లమ్ లేకుండా పోయింది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి మళ్లీ మంచిరోజులొచ్చాయని ఆ ప్రాంత వాసులు, దాన్ని రాజధానిగా చూడాలనుకున్న వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు కూడా అమరావతిని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడ అమరావతిలో అనేక నిర్మాణాలు చేపట్టారు. అయితే వాటిని గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించడంతో నిరుపయోగంగా మారిపోయాయి. చుట్టూ మొక్కలు మొలిచి చిట్టడవిలాగా ఆ ప్రాంతం మారిపోయింది. వాటిని పూర్తి చేసి ఉంటే అధికారులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉండేది. కానీ జగన్ అలా చేయలేదు. పూర్తిగా విస్మరించారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే అమరావతిలోని ఆయా కట్టడాలకు వెళ్లి పరిశీలించారు. అమరావతిని పూర్తి చేయడమే తన లక్ష్యం అని ప్రకటించారు.

అమరావతిని మళ్లీ పట్టాలపైకి తీసుకురావడం ఆషామాషీ వ్యవహారం కాదు. గతంలో సీఆర్డీయే పరిధిలో రాజధాని ప్రాంతం ఉండేది. జగన్ హయాంలో సీఆర్డీయేకి ఉనికి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ దాన్ని పట్టాలపైకి తీసుకారావాల్సిన అవసరం ఏర్పడింది. అంతేకాక.. సగంలో నిలిచిపోయిన భవనాలను పూర్తి చేయాలంటే మళ్లీ ఆ కాంట్రాక్టర్లతో చర్చలు జరపాల్సి ఉంటుంది. ఇక సెక్రటేరియేట్, అసెంబ్లీలను ఐకానిక్ భవనాలుగా నిర్మించాలని నాడు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పూర్తయితేనే అమరావతి ఓ రూపం దాల్చుకుంటుంది. అదే సమయంలో నాడు వివిధ సంస్థలకు స్థలాలు ఇచ్చింది ప్రభుత్వం. అవేవీ ఇక్కడికొచ్చి పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు ఆయా సంస్థలతో మళ్లీ చర్చలు ప్రారంభించింది టీడీపీ ప్రభుత్వం. ఒక విధంగా చెప్పాలంటే అమరావతిని మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. అయినా ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.. మూడేళ్లలోనే అమరావతిని పూర్తి చేయడమే తన లక్ష్యమని చంద్రబాబు చెప్తున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :