ASBL NSL Infratech

ప్రమాణ స్వీకారానికి ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న చంద్రబాబు

ప్రమాణ స్వీకారానికి ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 స్థానాలు లభించాయి. మొత్తం 175 సీట్లలో 164 స్థానాలను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. వైసీపీపై ప్రజావ్యతిరేకతతోనే కూటమి పార్టీలకు ప్రజలు పట్టం కట్టారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని చక్కదిద్దాల్సిన పని చంద్రబాబుపై పడింది. అందుకే ఆయన ప్రమాణం స్వీకారం చేయకముందే కీలక ఆదేశాలు ఇస్తూ పనులు చక్కబెడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ఆయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. వైసీపీ హయాంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని.. రాష్ట్రం అప్పుల పాలయిందని టీడీపీ ఆరోపిస్తోంది. అంతేకాక సంక్షేమం పేరుతో అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శిస్తోంది. అందుకే వీటన్నింటినీ వీలైనంత త్వరగా చక్కబెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు తెలుస్తోంది.

వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపైన కూడా చంద్రబాబు నాయుడు కన్నేశారు. ముఖ్యంగా మైనింగ్, మద్యం కుంభకోణాలపై విచారణకు ఆదేశించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ రెండు ఆఫీసులను అధికారులు సీజ్ చేశారు. మరోవైపు.. వైసీపీ ఓడిపోగానే డిప్యుటేషన్ పై వచ్చిన వాళ్లంతే సొంత స్థలాలకు వెళ్లిపోయేందుకు అర్జీలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు అలాంటివాటన్నింటినీ అధికారులు తిరస్కరిస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారందరిపైనా విచారణ జరిపేందుకే వారిని ఇక్కడే ఉంచుకోనున్నట్టు సమాచారం.

మరోవైపు అమరావతి ఈ ఐదేళ్లలో చిన్న అడవిలాగా మారిపోయింది. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ముళ్లకంపలు, చెట్లతో అమరావతి ప్రాంతమంతా నిండిపోయింది. చంద్రబాబు ప్రమాణం పూర్తవగానే ఫస్ట్ ప్రయారిటీగా అమరావతినే తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే అమరావతిలో క్లీనింగ్ పనులు చకచకా సాగుతున్నాయి. అమరావతిని పూర్తి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది. ఓవైపు గత పాలనలో అక్రమాలు, అవినీతిపై చర్యలు తీసుకోవడమే కాకుండా.. మరోవైపు రాష్ట్రాభివృద్ధిని కూడా ప్రయారిటీగా తీసుకుని పనిచేయనున్నట్టు చంద్రబాబు ఆదేశాలను బట్టి అర్థమవుతోంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :